విల్లాల పేరుతో ఘరానా మోసానికి పాల్పడిన జీఎస్‌ఆర్ గ్రూప్ రియల్ ఎస్టేట్ సంస్థపై బాధితులు ఫిర్యాదు చేశారు. జీఎస్‌ఆర్ గ్రూప్ చైర్మన్ జి.శ్రీనివాస్‌రావుపై పది రోజుల క్రితమే ముప్పై ముందికి పైగా బాధితులు ఫిర్యాదుచేసినప్పటికీ నిందితుడిపై చర్యలు తీసుకోకపోవడంతో బుధవారం మరోసారి సీసీఎస్ డీసీపీ శ్వేతను కలిసి మరిన్ని ఆధారాలు.. చెక్కులు, డబ్బు చెల్లించిన రశీదులు, అగ్రిమెంట్ పత్రాలు సమర్పించారు.
నగర శివార్లలో రంగారెడ్డి, యాదాద్రి జిల్లాల పరిధిలోని మోకిల, కొల్లూరు, అబ్దుల్లాపూర్‌మెట్, యాదాద్రి తదితర ప్రాంతాలలో విల్లాలు, ప్లాట్లకు సంబంధించి భారీ వెంచర్లు వేస్తున్నామని, ప్రీ–లాంచింగ్‌లో సగం ధరకే విల్లాలు, ప్లాట్లు ఇస్తామంటూ జీఎస్‌ఆర్ గ్రూప్ ఆఫర్ పెట్టింది. పెద్దమొత్తంలో పెట్టుబడి పెట్టేవారికి లాభాల్లో షేర్ ఇస్తామంటూ నమ్మబలికింది. దీంతో పెద్ద సంఖ్యలో కస్టమర్లు రూ.కోటి నుంచి మూడు కోట్ల వరకు చెల్లించారు. అయితే ఇదంతా జరిగి రెండేళ్లు కావస్తున్నా వెంచర్ల జాడ లేకపోవడం, వెంచర్ల కోసం కొనుగోలు చేసిన స్థలాలు కూడా సంస్థవి కాకపోవడంతో తమ డబ్బులు వాపసు చెల్లించాలంటూ జీఎస్‌ఆర్ సంస్థ చైర్మన్ శ్రీనివాస్ రావును కస్టమర్లు నిలదీశారు.
మోసాలు బయటపడటంతో శ్రీనివాస్‌రావు ఎదురుదాడికి దిగి వారిని బెదిరించే ప్రయత్నం చేశాడు. దీంతో 32మందికి పైగా బాధితులు హైదరాబాద్ సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. జీఎస్‌ఆర్ గ్రూప్‌పై మొత్తం రెండు కేసులను పోలీసులు నమోదు చేశారు. ముందస్తు బెయిల్ తెచ్చుకున్న శ్రీనివాస్‌రావు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. జీఎస్‌ఆర్ గ్రూప్‌నకు చెందిన ముఖ్యులకు నోటీసులు ఇవ్వాలని డీసీపీ ఆదేశించినప్పటికీ ఏసీపీ తాత్సారం చేస్తున్నట్లు తెలుస్తోంది..