చత్తీస్ గఢ్ లోని జష్పూర్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ గ్రామంలోని బాలికపై గ్యాంగ్ రేప్ జరగగా.. ఈ కేసులో పోలీసులు ఏడుగురిని అరెస్టు చేశారు. నిందితుల్లో ఆరుగురు మైనర్లు ఉన్నారు. వీరిలో ఒకరి వయస్సు 19 ఏళ్లు కాగా.. మిగతా వారి వయస్సు 15 నుంచి 17 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు వెల్లడించారు. నిందితుల్లో ఒకడు బాధితురాలికి తెలిసిన వ్యక్తేనని తెలిపారు. ఆదివారం రాత్రి పాతల్‌గాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుందని సర్గుజ ఎస్పీ యోగేశ్ పటేల్ వెల్లడించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఓ గ్రామానికి చెందిన బాలిక మార్కెట్‌కు వెళ్లి తన స్నేహితులతో కలిసి ఇంటికి వస్తుండగా ఆమెకు తెలిసిన వ్యక్తి అడ్డుకున్నాడు. ఆ తర్వాత ఆమెను బలవంతంగా తమతో పాటు తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టారు. ఎలాగో రాత్రిపూట ఇంటికి చేరుకున్న బాలిక.. తనపై జరిగిన అఘాయిత్యంపై సీతాపుర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసుకొని నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. తదుపరి చర్యల కోసం ఈ కేసును జష్‌పుర్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేసినట్లు ఎస్పీ వెల్లడించారు.