కర్ణాటక రాజకీయాల్లో మరో సంచలనం నమోదైంది. లైంగిక వేధింపులు ఒకే కుటుంబాన్ని వేధిస్తూ జైలు పాలు చేస్తున్నాయి. ఇప్పటికే జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ( Prajwal Revann ) లైంగిక వేధింపుల కేసులో జైలులో ఉండగా.. తాజాగా ఆయన సోదరుడు ఎమ్మెల్సీ డాక్టర్ సూరజ్ రేవణ్ణను ( Suraj Revanna ) కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారు.
అసహజ లైంగిక వేధింపులకు దిగాడంటూ ఓ యువకుడు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు సూరజ్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దాడి, నగ్న వీడియోల కేసు కన్నడ రాజకీయాలను కుదిపేసింది. తనపై అసహజ లైంగిక దాడికి పాల్పడినట్లు చేతన్ అనే జేడీఎస్ కార్యకర్త ఒకరు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హాసన్ జిల్లాకు అరకలగూడుకు చెందిన అతడు సూరజ్ వేధింపులకు సంబంధించిన వీడియోలను కూడా విడుదల చేశాడు. లోక్ సభ ఎన్నికల సమయంలో పరిచయమైన సూరజ్ తనను తన ఫాంహౌస్ కు పిలిచి దాడికి ప్రయత్నించాడని చేతన్ ఆరోపించాడు. ఆయన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. వైద్య పరీక్షల నిమిత్తం అతడిని ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
వైద్య పరీక్షల్లో యువకుడి ఒంటిపై గాయాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. తనపై వచ్చిన ఆరోపణలను ఖండించాడు సూరజ్ రేవణ్ణ. తాను కోరినట్లు రూ.5 కోట్లు ఇవ్వకపోతే లైంగికదాడికి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించాడని అన్నాడు.