హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలో 18 రోజుల నవజాత శిశువును విక్రయించిన కేసులో తండ్రితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా శిశువును విక్రయించిన 24 గంటల్లోపే పోలీసులు తల్లి ఒడికి చేర్చారు. వివరాల్లోకి వెళితే.. పాతబస్తీకి చెందిన ఆసిఫ్ తన భార్య అస్మా బేగంను బెదిరించి తమ బిడ్డను కర్ణాటక రాష్ట్రానికి చెందిన మినాల్ సాద్ కు లక్ష రూపాయలకు అమ్మాడు.
ఈ విషయంలో చాంద్ సుల్తానా మధ్యవర్తిగా వ్యవహరించింది. వెంటనే శిశువు తల్లి అస్మా తన పాప తనకు కావాలని బండ్లగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే కర్ణాటక వెళ్లి పాపను తిరిగి తీసుకువచ్చి తల్లికి అప్పగించారు. బాలిక తండ్రి, మధ్యవర్తిగా ఉన్న మహిళను, శిశువును విక్రయించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 24 గంటల్లోపే ఆ పసికందును తల్లిఒడికి చేర్చిన పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు.