తెలంగాణ పోలీసు శాఖకు చెందిన హాక్ ఐ, టీఎస్ కాప్, ఎస్‌ఎంఎస్ పోర్టల్ యాప్‌లను హ్యాక్ చేసి డేటా చోరీ చేసిన హ్యాకర్‌ను అరెస్టు చేసినట్లు డీజీపీ రవిగుప్తా తెలిపారు. ఈ నెల 8న ఢిల్లీలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఆదివారం ఓప్రకటనలో పేర్కొన్నారు. హ్యాకర్ చోరీ వివరాలను databreachforum.st లో పోస్ట్ చేసి, ఆ డేటాను 150 డాలర్ల (రూ.12,529)కు అమ్మకానికి పెట్టాడని తెలిపారు. ఆసక్తి గలవారు సంప్రదించడానికి టెలిగ్రామ్ ఐడీలు కూడా అందులో ఉంచినట్లు డీజీపీ వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు అధునాతన సాంకేతికతతో ఢిల్లీలో 20ఏళ్ల జతిన్ కుమార్(యూపీకి చెందిన)ను నిందితుడిగా గుర్తించారన్నారు. అతడిని ట్రాన్సిట్ రిమాండ్‌పై హైదరాబాద్‌కు తీసుకురానున్నట్లు వివరించారు. కాగా, హాక్‌ఐ యాప్ డేటాలో మొబైల్ నంబర్, చిరునామా, ఈమెయిల్ ఐడీ వంటి సమాచారమే ఉంటుందని.. డీజీపీ తెలిపారు. వినియోగదారుల వ్యక్తిగత సమాచారం లీక్ కాలేదన్నారు.