Canara Bank Appraiser : రాజుపేట కెనరా బ్యాంక్​ అప్రైజర్ ఆరెస్ట్

Update: 2024-05-31 06:41 GMT

ములుగు జిల్లా మంగపేట మండలం రాజుపేట కెనరా బ్యాంక్​లో బంగారం కాజేసిన అప్రైజర్ ​సమ్మెట ప్రశాంత్​ను గురువారం అరెస్ట్ చేశామని ఏఎస్పీ మహేశ్​గీతే బాబాసాహెబ్ తెలిపారు. రెండేండ్లుగా కెనరా బ్యాంకులో అప్రైజర్ గా పనిచేస్తున్న ప్రశాంత్​ బ్యాంకు పక్కనే సాయిరామ్ జ్యువెల్లర్స్​ నడుపుతున్నాడు. జ్యువెల్లర్స్​కు వచ్చే వారు నగల కోసం ఇచ్చే బయానా డబ్బులను స్టాక్ మార్కెట్​లో పెట్టి నష్టపోయాడు. సుమారు రూ.70 లక్షల వరకు పోగొట్టుకున్నాడు. కస్టమర్లు డబ్బులు, బంగారం అడుగుతుండడంతో బ్యాంకులోని గోల్డ్ ను కాజేయాలని ప్లాన్​ వేశాడు. కస్టమర్లు తెచ్చే బంగారం స్వచ్ఛత చెక్​ చేస్తున్నట్టు నటిస్తూ కొట్టేసి దాని స్థానంలో నకిలీ బంగారం ప్యాకెట్ పెట్టేవాడు. ఇలా మూడు నెలల్లో 24 మంది వద్ద 2 కిలోల 117 గ్రాముల బంగారాన్ని మాయం చేశాడు. విషయం బయటపడడంతో పరారీ కాగా, గురువారం ఏటూరునాగారం మండలం ఎక్కల గ్రామం క్రాస్ రోడ్డు వద్ద పట్టుకున్నారు. ప్రశాంత్ నుంచి 47 గ్రాముల నగలు,190 కిలోల వెండి, రూ. రెండున్నర లక్షల నగదు, కారు, తొమ్మిది మెబైల్స్ స్వాధీనం చేసుకున్నామని ఏఎస్పీ చెప్పారు. ఏటూరునాగారం సీఐ ఎం.రాజు, మంగపేట ఎస్సై రవికుమార్, ములుగు సీసీఎస్ ​సిబ్బందిని ఏఎస్పీ అభినందించారు

Tags:    

Similar News