నగరంలో మరో రియల్ ఎస్టేట్ కంపెనీ బోర్డు తిప్పేసింది. స్క్వేర్ అండ్ యార్డ్స్ ఫామ్‌హౌస్, విల్లాల పేరుతో కోట్లలో మోసం చేసింది. ఈ సంస్థపై కేసు నమోదు చేసిన సైబరాబాద్ పోలీసులు.. సంస్థ యజమాని బైరా చంద్రశేఖర్ తోపాటు మరో నలుగురిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్ శివారులో ఫామ్‌హౌస్‌లు, విల్లాల పేరుతో ప్రజల వద్దనుండి రూ. 24 కోట్లు వసూలు చేసినట్టు సమాచారం. ఫామ్‌హౌస్ లు, విల్లాలపై పెట్టుబడి పెడితే రెట్టింపు డబ్బులు ఇస్తానని చంద్రశేఖర్ ఆశ చూపినట్టు తెలుస్తోంది. అతని మాటలు నమ్మి వందల మంది స్క్వేర్ అండ్ యార్డ్స్ సంస్థలో భారీగా పెట్టుబడులు పెట్టారు. గత కొద్ది నెలలుగా చంద్రశేఖర్ నుండి ఎలాంటి సమాధానం లేకపోవడంతో ఆఫీసు వద్దకు వచ్చి నిలదీయగా.. తన వద్ద డబ్బులు లేవంటూ చంద్రశేఖర్ చేతులు ఎత్తేశాడు. మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించగా.. స్క్వేర్ అండ్ యార్డ్స్ సంస్థపై కేసులు నమోదు చేసి, పలువురిని అరెస్ట్ చేశారు.