నాగర్కర్నూల్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ముగ్గురు పిల్లలను చంపి తండ్రి కూడా ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. కుటుంబ కలహాల నేపథ్యంలో గతనెల 30న ముగ్గురు పిల్లలతో తండ్రి గుత్తా వెంకటేశ్వర్లు (38) బైక్పై బయటకు వచ్చాడు. వెల్దండ మండలం పెద్దాపుర్ గ్రామ శివారులో విగతజీవిగా పడి ఉండడం.. పక్కనే పురుగుల మందు డబ్బా కనిపించడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లుగా ప్రాథమికంగా పోలీసులు నిర్ధరించారు. డిండి ప్రాజెక్టు పరిసరాల్లో తండ్రి, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు తిరిగినట్లు గుర్తించారు. బుధవారం వెంకటేశ్వర్లు మృతదేహం లభ్యం కాగా.. చిన్నారుల ఆచూకీ గురువారం ఉదయం వరకు తెలియరాలేదు. ఈ క్రమంలో గాలింపు చేపట్టిన పోలీసులు.. ఉప్పనుంతల మండలం సూర్య తండా సమీపంలో వెంకటేశ్వర్లు చిన్నకుమార్తె వర్షిణి (6), కుమారుడు శివధర్మ (4) మృతదేహాలు, తాండ్ర సమీపంలో పెద్దకుమార్తె మోక్షిత (8) మృతదేహం లభ్యమయ్యాయి. ముగ్గురు చిన్నారులను తండ్రే చంపేసి పెట్రోల్ పోసి తగులబెట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. అనంతరం అతడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.