తెలంగాణ రాష్ట్రం షాద్ నగర్ కి చెందిన అరటి అరవింద్ యాదవ్ అనుమానాస్పద పరిస్థితుల్లో ఆస్ట్రేలియాలో మృతి చెందారు. ఆయన 5 రోజుల క్రితం అదృశ్యమయ్యారు. సిడ్నీలోని సముద్ర తీరంలో శవమై తేలాడు అరవింద్. దీనికి కొద్ది దూరంలోనే అరవింద్ కారును పోలీసులు గుర్తించారు.
లభించిన ఆధారాలతో చనిపోయింది అరవింద్ గా గుర్తించారు సిడ్నీ పోలీసులు. వెంటనే స్థానిక కంపెనీ, దగ్గరి వారికి సమాచారం ఇచ్చారు. ఉద్యోగం నిమిత్తం 12 ఏళ్లుగా సిడ్నీలో ఉంటూ అక్కడే స్థిరపడ్డారు అరవింద్. అరవింద్ ది హత్య.. ఆత్మహత్య.. అనే కోణంలో విచారణ జరుపుతున్నారు పోలీసులు.
18 నెలల క్రితమే అరవింద్ కి వివాహమైందని తెలుస్తోంది. పెళ్లి తర్వాత భార్య, తల్లితో కలిసి ఆస్ట్రేలియా వెళ్లాడు అరవింద్. ఇటీవలే వారం రోజుల క్రితం ఇండియాకి అరవింద్ తల్లి తిరిగి వచ్చింది. భార్య ఆస్ట్రేలియాలోనే ఉంటోంది. ఇంతలోనే ఈ ఘోరం జరగడంతో ఆ కుటుంబంలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.