కుమార్తెతో గొడవ పెట్టుకున్నాడనే కోపంతో అల్లుడిపై అత్త, మామ పెట్రోల్ పోసి నిప్పంటించిన దారుణ ఘటన ఇది. పాల్వంచ(మ) దంతెలబోరకు చెందిన గౌతమ్‌కు రామచంద్రునిపేటకు చెందిన కావ్యతో 3 ఏళ్ల క్రితం పెళ్లైంది. ఇటీవల భర్తతో గొడవ కావడంతో ఆమె పుట్టింటికెళ్లింది. భార్యను తీసుకెళ్లేందుకు ఫిబ్రవరి 2న వచ్చిన గౌతమ్‌కు ఆమె కుటుంబ సభ్యులతో గొడవైంది. ఆగ్రహంతో అత్త, మామ పెట్రోల్ పోసి నిప్పంటించగా, చికిత్స పొందుతూ చనిపోయాడు. బోడు ఎస్‌ఐ పొడిశెట్టి శ్రీకాంత్‌ను వివరణ కోరగా ఈ నెల 2న రామచంద్రునిపేటలో ఘటన జరిగిందని, 11న మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. కాగా, ఈ నెల 2న ఘటన జరిగి, 11న ఫిర్యాదు వచ్చినప్పటికీ ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడంతో ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.