visakhapatnam : సర్పంచ్ వేధింపులు తట్టుకోలేక యువకుడి ఆత్మహత్య
visakhapatnam : సర్పంచ్ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ సెల్ఫీ వీడియో తీసుకుని మరీ చనిపోయాడు ఓ యువకుడు.;
visakhapatnam : సర్పంచ్ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ సెల్ఫీ వీడియో తీసుకుని మరీ చనిపోయాడు ఓ యువకుడు. అనకాపల్లి జిల్లా కశింకోట మండలం కొత్తపల్లిలో ఈ ఘటన జరిగింది. బుచ్చియపేటకు చెందిన శ్రీనివాస్.. తను ఇష్టపడే అమ్మాయిని గ్రామ సర్పంచ్ బారి నుంచి రక్షించేందుకు ప్రయత్నించాడు. ఆ అమ్మాయి జోలికి రావొద్దంటూ వాట్సప్ స్టేటస్ పెట్టాడు. దీనిపై ఆగ్రహించిన వైసీపీ సర్పంచ్ కన్నం శ్యామ్.. యువకుడు శ్రీనివాస్‌ను రాళ్లతో కొట్టించి, ఆడవాళ్లతో దాడి చేయించి, తిరిగి పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లి కంప్లైంట్ చేశారని బాధితుడి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఒక అమ్మాయిని రక్షించేందుకు ప్రయత్నించాను తప్ప.. ఇందులో తాను చేసిన తప్పేంటి అంటూ ప్రశ్నిస్తూ.. ఉరివేసుకుని చనిపోయాడు.
శ్రీనివాస్‌ను ఇష్టపడుతున్న ఓ అమ్మాయిపై.. గ్రామ సర్పంచ్ కన్నం శ్యామ్ కూడా కన్నేశాడనే ఆరోపణలున్నాయి. శ్రీనివాస్‌తోనే కాదు.. తమతో కూడా ఉండాలంటూ అసభ్యంగా ప్రవర్తించేవాడని గ్రామస్తుల్లోని కొందరు చెబుతున్నారు. తనను ఇష్టపడిన అమ్మాయిని రక్షించేందుకు చేసిన ప్రయత్నంలో.. గ్రామ సర్పంచ్ అరాచకాలు తట్టుకోలేక ప్రాణాలు తీసుకున్నాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. వైసీపీ సర్పంచ్ ఆగడాలపై గ్రామస్తులు కూడా చాలా కాలంగా ఆరోపణలు చేస్తున్నారు. సర్పంచ్ శ్యామ్ ఓ నియంతలా ప్రవర్తిస్తాడని, తన అనుచరులతో కలిసి అరాచకాలు సృష్టిస్తున్నాడని చెబుతున్నారు. సర్పంచ్‌గా తాను ఏం చెబితే అది చేయాల్సిందేనన్న రీతిలో ప్రవర్తిస్తుంటాడని చెబుతున్నారు.
ఆత్మహత్య చేసుకున్న శ్రీనివాస్.. టీడీపీ కార్యకర్తగా ఉన్నాడు. 2019 ఎన్నికల నుంచి పార్టీ కోసం పనిచేశాడు. మొన్నటి పంచాయతీ ఎన్నికల్లోనూ వైసీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. ఆ కోపాన్ని ఇంకా మనుసులో పెట్టుకున్న వైసీపీ సర్పంచ్ కన్నం శ్యామ్.. శ్రీనివాస్‌ను కొట్టించి, కేసులో ఇరికించి, చివరికి ఉరివేసుకుని చనిపోయేలా చేశారని మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ ఆరోపించారు.