హర్యానాలోని ఫరీదాబాద్ జిల్లాలో జరిగిన ఒక విషాద ఘటనలో, ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఎయిర్ కండీషనర్ ఔట్‌డోర్ యూనిట్‌లో షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఊపిరి ఆడక ప్రాణాలు కోల్పోయారు.
పోలీసుల వివరాల ప్రకారం...ఫరుదబాద్ కు చెందిన సచిన్ కపూర్ అతని భార్య రింకు తో నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. మొదటి అంతస్తులోని తమ గదిలో నిద్రిస్తున్న సమయంలో ఈ ఘోరం జరిగినట్లు తెలుస్తోంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఏసీలో మంటలు చెలరేగి, ఇల్లంతా దట్టమైన పొగ వ్యాపించింది. దీంతో కుటుంబ సభ్యులు తప్పించుకునేందుకు ప్రయత్నించినప్పటికీ, పొగ కారణంగా ఊపిరాడక లోపల చిక్కుకుపోయారు. ఈ ప్రమాదంలో సచిన్ అతని భార్యతో పాటు కుమార్తె సుజన్ ఊపిరాడక మరణించారు. వారి కుమారుడు ఆర్యన్ పరిస్థితి విషమంగా ఉండటంతో అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏసీ వల్ల కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోవడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.