తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు మంగళ వారం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు పవిత్ర ప్రతిష్ట నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని పవిత్ర మండపంలోని యాగశాలకు వేంచేపుచేశారు. అక్కడ హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం సంపంగి ప్రాకారంలో వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుంగంధద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. ఈ సందర్భంగా వేద పండితులు పంచసూక్తాలను పఠించారు. ఆ తర్వాత పవిత్ర ప్రతిష్ట జరిగింది. మధ్యాహ్నం స్వామి, అమ్మవార్లకు విశేష సమర్పణ చేశారు. అనంతరం సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. రాత్రి యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరుగనున్నాయి. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, ఆలయ ప్రధాన అర్చకులు, డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, పేష్కర్ శ్రీ రామకృష్ణ, భక్తులు పాల్గొన్నారు.