మలయప్ప స్వామి పాదాలను తాకిన సూర్య కిరణాలు.. పులకించిపోయే దృశ్యం

ఆలయ వాయువ్య దిక్కుకు చేరుకోగానే సూర్యోదయాన భానుడి తొలి కిరణాలు మలయప్ప స్వామి పాదాలను తాకాయి.

Update: 2021-02-19 03:08 GMT

సూర్య జయంతిని పురస్కరించుకుని తిరుమలలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వేకువజామునే మలయప్ప స్వామి వారు తిరుమాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం ఐదున్నర నుంచి 8 గంటల వరకూ సూర్యప్రభ వాహనంపై శ్రీవారు విహరిస్తారు. కరోనా అనంతరం మొదటిసారి తిరుమాడ వీధుల్లో వాహనాలపై ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేస్తున్నారు. ఇవాళ రథసప్తమి సందర్భంగా ఏడు వాహనాలపై స్వామివారు భక్తుల్ని అనుగ్రహిస్తారు. ఆలయ వాయువ్య దిక్కుకు చేరుకోగానే సూర్యోదయాన భానుడి తొలి కిరణాలు మలయప్ప స్వామి పాదాలను తాకాయి. గ్యాలరీల్లో భక్తులు ఈ కమనీయ దృశ్యాన్ని చూసి పులకించిపోయారు.

రథసప్తమి రోజు ఏడు వాహనాలపై స్వామివారి ఊరేగింపులో భాగంగా ముందు సూర్యప్రభ వాహన సేవ జరుగుతోంది. తర్వాత చిన్నశేష వాహనం, గరుడ వాహనం, హనుమంత, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై మలయప్ప స్వామి తిరుమాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు.

రథసప్తమి సందర్భంగా తిరుమల వచ్చే భక్తులు కోవిడ్‌ నిబంధనలు పాటించాలని TTD సూచిస్తోంది. ఆలయ మాడవీధుల్లో భక్తులకు తాగునీరు, మజ్జిగ, అన్నప్రసాదం, అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉంచారు. ఇవాళ కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకరణ సేవలను రద్దు చేశారు. సుప్రభాతం, తోమాల, అర్చనలు ఏకాంతంగా నిర్వహించారు. 

Tags:    

Similar News