యాదాద్రికొండపై ఆధ్యాత్మికత వెళ్లి విరిసింది. భక్తుల జయ జయ ధ్వానాలు, కేరింతల నడుమ గిరి ప్రదక్షణ కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది.తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ ఆలయంలో గిరి ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహించారు పండితులు. స్వామివారి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా గిరి ప్రదక్షణ చేయడం ఆనవాయితీ. ముందుగా వైకుంఠ ద్వారం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన పండితులు.. కొండ చుట్టూ తిరిగారు. ప్రత్యేక ఆరాధనలో భాగంగా స్వామివారి మూల విరాట్ లకు ఆష్టోత్తర శత ఘటాభిషేకం నిర్వహించారు.
వైదిక కార్యక్రమాలలో భాగంగా శ్రీవేంకటేశ్వర అన్నమాచార్య సేవా ట్రస్ట్ బృందం ఆధ్వర్యంలో ప్రదర్శించిన భరత నాట్యం అందరిని ఆకట్టుకుంది. ఆధ్యాత్మిక చింతనతో క్షేత్ర సందర్శనకు వచ్చే భక్తులకు మానసిక ఉల్లాసం అందించే లక్ష్యంగా దేవస్థానం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తోంది.