కావలి ఎమ్మెల్యే కథ ముగిసినట్టేనా...?

Update: 2023-05-16 14:54 GMT


సీఎం పర్యటనతో కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి డీలా పడ్డారా ? జగన్ టూర్‌ను ఎమ్మెల్యే సక్సెస్ చేయలేకపోయారా? జగన్ పర్యటన నేపథ్యంలో అత్యుత్సాహం ప్రదర్శించారా? తన ప్రసంగంలో ఒక్కసారి కూడా ఎమ్మెల్యే పేరు ప్రస్తావించ పోవడానికి కారణాలేంటి? టికెట్‌పై సిట్టింగ్ ఎమ్మెల్యే ఆశలు అడియాసలైనట్లేనా?

కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై వైసీపీ అధిష్ఠానం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు పబ్లిక్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. జగన్‌ టూర్‌ను సక్సెస్‌ చేసి అధిష్ఠానం వద్ద మార్కులు కొట్టేద్దామనుకున్న ప్రతాప్ కుమార్ రెడ్డికి సీన్ రివర్స్ కావడంతో గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లు టాక్ వినిపిస్తోంది. ముఖ్యమంత్రి పర్యటన ఖరారయినప్పటినుండి ప్రతాప్ కుమార్ రెడ్డికి అడుగడుగునా ప్రతికూల పరిస్థితులే ఎదురవుతున్నాయి. కావలిలో జగన్ పర్యటన సందర్భంగా హెలిప్యాడ్‌ను సభాప్రాంగణానికి దూరంగా ఏర్పాటు చేశారు. హెలీప్యాడ్ నుండి సభాప్రాంగణం వరకు సీఎం కాన్వాయ్ ను ర్యాలీగా తీసుకెళ్లి జగన్ మెప్పు పొందుదామనుకున్న ప్రతాప్ కుమార్ రెడ్డికి పరిస్థితులు అనుకూలించలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. హెలిప్యాడ్ ఏర్పాటు చేసిన జడ్పీ ప్రాంగణం వద్ద వ్యాపారాలు చేసుకునే షాపుల తొలగింపు, కూతవేటు దూరంలో ఉన్న దళితవాడకు పవర్ కట్ చేసి కరెంటు స్థంభాల తొలగింపు.. నగరంలో పచ్చని చెట్లు నరికివేత వంటి ప్రతి అంశంలోను ప్రతాప్ కుమార్ రెడ్డికి ఎదురు దెబ్బలే తగిలినట్లు టాక్ వినిపిస్తోంది. మొన్నటి వరకు సుకుమార్ రెడ్డి అనే వ్యక్తి ఎమ్మెల్యే వెనక ఉండి అన్ని తానై నడిపిస్తుండటంతో పదేళ్లు చక్రం తిప్పిన ప్రతాప్ కుమార్ రెడ్డి.. సుకుమార్ రెడ్డిని దూరం పెట్టడంతో సొంత మనుషులు లేక ఎమ్మెల్యే ఒంటరైపోయాడని కావలిలో జోరుగా చర్చ నడుస్తోంది.

ముఖ్యమంత్రి పర్యటన ఉంటే వారం పది రోజుల ముందే జిల్లాకు చెందిన మంత్రి, జిల్లా పార్టీ అధ్యక్షుడు తిష్టవేసి పరిస్థితులను చక్కదిద్దడం సర్వసాధారణం. అయితే అందుకు భిన్నంగా కనీసం జిల్లా అధ్యక్షుడు ముఖ్యమంత్రి పర్యటనకు ఒక్కరోజు ముందు కూడా కావలిలో అడుగుపెట్టలేదు. సరికదా ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు పార్టీలోని అంతర్గత విభేదాలను మరోసారి బయటపడినట్లు తెలుస్తోంది. కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఫ్లెక్సీలు తప్ప ఇతర నేతల ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకపోవడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. జిల్లా మంత్రి, కోఆర్డినేటర్, జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మరో నేత ఫ్లెక్సీ లేకుండా తమను అవమానించారని జిల్లాలోని నేతలు ప్రతాప్ కుమార్ రెడ్డి మీద గుర్రుగా ఉన్నారట. ఎమ్మెల్యే ఏకపక్ష నిర్ణయాలతో విభేదించిన జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు పలువురు డుమ్మా కొట్టడంతో ఈ వ్యవహారం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

దీనికి తోడు ఎమ్మెల్యే అవినీతి, అక్రమాలను ముఖ్యమంత్రి దృష్టికి వినతి పత్రం ద్వారా తీసుకెళ్తామని ప్రతిపక్ష టీడీపీ, బీజేపి, ప్రజాసంఘాల నాయకులు ప్రకటన చేసిన నేపథ్యంలో ఎక్కడికక్కడ ప్రతిపక్ష నేతలను హౌస్ అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఉదయగిరి బ్రిడ్జి వద్దకు వచ్చేసరికి బీజేపీ నాయకులు కాన్వాయ్‌ని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో రచ్చరచ్చగా మారిందట. దీనిపై వివరాలు అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి ఘటన పై సీరియస్ అయినట్టు సమాచారం. ముఖ్యమంత్రి వస్తున్నప్పుడు కనీసం ఇలాంటి విషయాలను మేనేజ్ చేసుకోవడం కూడా తెలియదా అని మందలించినట్టు పార్టీవర్గాల్లో చర్చ నడుస్తోంది. దీంతో రాబోయే ఎన్నికల్లో కావలి నుండి బరిలో దిగి హ్యాట్రిక్ విక్టరీ నమోదు చేద్దామనుకున్న ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆశలు అడియాశలు అయినట్టేనని నియోజకవర్గ వైసీపీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు.

ముఖ్యమంత్రి పర్యటన ఏ నియోజకవర్గంలో జరిగితే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎగిరి గంతేస్తాడు. అయితే ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డికి కనీసం ఆ ఆనందం కూడా దక్కలేదని ... జగన్ నలబై అయిదు నిమిషాల ప్రసంగంలో ఒక్కసారి కూడా ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి పేరు ప్రస్తావించకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.

Similar News