నారాయణ్ ఖేడ్ కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరు
కాంగ్రెస్ కంచుకోటలో ఆ ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు సాగుతోందా? పంతానికిపోయి పార్టీని అభాసుపాలు చేస్తున్నారా? వరుస ఓటములు ఎదురవుతున్నా కుమ్ములాటలు ఆగడంలేదా? ఇరువురి వైరంతో పార్టీకి నష్టం జరుగుతోందని కేడర్ మొత్తుకొంటున్నా ఆ నేతలు వినడంలేదా? ఇంతకీ గొడవ అంతా ఏ నియోజకవర్గంలో.?ఆ ఇద్దరు నేతలు ఎవరు...?;
జాతీయ పార్టీ అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ తెలంగాణలో వరుస ఓటములు ఎదురవుతున్నా గుణపాఠం నేర్చుకోవడంలేదని జోరుగా చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో అధికారం లేకపోయినా.. ఎమ్మెల్యే సీటు ఓడినా హస్తం పార్టీలో కుమ్ములాటలు మాత్రం ఆగడంలేదని చర్చ సాగుతోంది. ఆది నుంచి రెండు కుటుంబాల మధ్యే కాంగ్రెస్ పార్టీ పంచాయతీ నడుస్తోంది. ఎన్నికల సమయంలో మరోసారి ఆ ఇద్దరి మధ్యే పోరు తీవ్రమైనట్లు టాక్ నడుస్తోంది. వర్గపోరు నేపథ్యంలో నేతలు పట్టిన పంతం వీడకపోవడంతో ఆ నియోజకవర్గానికి రావడానికే ముఖ్య నేతలు ముఖం చాటేస్తున్నట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ జోడో యాత్రలోనూ ఈ వైఖరితో ఇబ్బందులు ఎదురయినట్లు క్యాడర్‌లో చర్చ జరుగుతోంది. మెదక్ జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు గీత గీసినట్లుగా రెండు వర్గాలుగా చీలిపోయారని పబ్లిక్‌లో టాక్ నడుస్తోంది. జిల్లా కాంగ్రెస్ నేతలు దివంగత ఎమ్మెల్యే కిష్టారెడ్డి కుమారుడు సంజీవరెడ్డి, మాజీ ఎంపీ సురేష్ షెట్కార్ వర్గాలుగా విడిపోయాయి. అయితే ఇరువురు నేతలూ తండ్రుల వారసత్వంతో రాజకీయాలు నడిపిస్తున్నవారే కావడంతో స్థానిక రాజకీయాలు ఉత్కంఠను రేపుతున్నాయి.
రెండు కుటుంబాల మధ్య సీట్ల ఒప్పందం ఉన్న నేపథ్యంలో ఒకసారి ఒక కుటుంబానికి టిక్కెట్ ఇస్తే... మరోసారి ఇంకో కుటుంబానికి టిక్కెట్ ఇవ్వాలి. అయితే ఉప ఎన్నిక నాటి నుండి సీన్ మారినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే కిష్టారెడ్డి మృతితో వచ్చిన ఉప ఎన్నికలో ఆయన కుమారుడు సంజీవరెడ్డి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున సురేష్ షెట్కార్ పోటీ చేయగా అప్పటికప్పుడు సంజీవరెడ్డి బిజెపిలో చేరి ఎమ్మెల్యేగా బరిలో దిగారు. అనూహ్యంగా ఇద్దరూ ఓటమి పాలు కాగా బీఆర్ఎస్ విజయం సాదించింది. ఆ తరువాత సంజీవరెడ్డి కాంగ్రెస్‌లో చేరిపోయారు. అప్పటి నుండి కాంగ్రెస్‌లో రెండు గ్రూపుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.
ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్నికలు సమీపిస్తుండటంతో టిక్కెట్ పంచాయతీ తెరమీదకు రావడంలో సురేష్‌షెట్కార్, సంజీవరెడ్డి మధ్య తీవ్ర పోటీ నెలకొన్నట్లు సమాచారం. రేవంత్‌రెడ్డి వద్ద పంచాయతీ జరిగినా... ఏటూ తేలలేదు. లింగాయత్ సామాజికవర్గం నుండి పోటీ పడుతున్న నేత సురేష్‌షెట్కార్ ఒక్కడే కావడం ఆయనకు కలిసి వచ్చే అంశంగా రాజకీయా వర్గాలు భావిస్తున్నాయి. సంజీవరెడ్డి సైతం అదే స్థాయిలో టిక్కెట్ ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే టికెట్ ఒకరికిస్తే మరొకరు పార్టీ నుండి జంప్ అవుతారంటూ క్యాడర్‌లో చర్చ నడుస్తోంది. అవసరమైతే ఇండిపెండెంట్‌గా పోటీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఇరు వర్గాల విభేదాలు ప్రత్యర్థి పార్టీకి కలిసివస్తుందని పార్టీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2014 వరకు కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న నారాయణ్ ఖేడ్ రాష్ట్ర విభజన అనంతరం 2016లో వచ్చిన ఉప ఎన్నికలతో సీన్ మొత్తం మారిపోయిందని టాక్ నడుస్తోంది. ఉప ఎన్నికల్లోనూ, 2018లో జరిగిన ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ విజయం సాధించింది.
మళ్లీ ఎన్నికలు సమయం దగ్గరపడుతున్నా.. కాంగ్రెస్‌మాత్రం గుణపాఠం నేర్చుకోవడం లేదని చర్చ నడుస్తోంది. సంజీవరెడ్డి, సురేష్ షెట్కార్ లు ఎవరికి వారు గ్రామాలకు వెళ్లి మీటింగ్‌లు పెట్టుకుంటున్నారు. పార్టీ సూచించిన కార్యక్రమాలను సైతం వేర్వేరుగా నిర్వహిస్తుండటంలో క్యాడర్ కూడా రెండుగా చీలిపోయినట్లు నియజకవర్గంలో చర్చ సాగుతోంది. వరుస ఓటములతో పబ్లిక్‌లో అభాసుపాలవుతున్నా... ఇరువురి నేతల తీరు మారడం లేదని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.