SAROGASI: సరోగసీ చట్టాలపై మన అవగాహన ఎంత...?
సరోగసి చట్టాలపై అవగాహన అత్యవసమంటున్న నిపుణులు;
మాతృమూర్తి కావటం ప్రతి మహిళ గర్వంగా భావిస్తుంది. బోసినవ్వుల పాపాయి ఇంటలేనిదే సంతృప్తి చెందలేరు. అలాగే పురుషుడికీ తండ్రి కావాలనే కోరిక ఉంటుంది. అయితే శారీరకమైన లోపాల కారణంగా గర్భధారణ జరగని సందర్భాల్లో ఆ దంపతుల మానసిక వేదనకు అంతు ఉండదు. అలాంటి వారికి మానసిక వేదనను దూరం చేసి, వారికి బిడ్డల్నిపొందే అవకాశం ఆధునిక శాస్త్ర సాంకేతిక విజ్ఞానం వల్ల కలుగుతోంది. అందులో భాగమే సరోగసీ (అద్దె గర్భం) విధానం. ఆలస్యంగా పెళ్లి కావడం, భరించలేని ఒత్తిడులు, మానసిక ప్రశాంతత లోపించడం, తీరికలేని జీవనవిధానం, ఆహారపు అలవాట్లు ఇవన్నీ సంతాన వైఫల్యానికి దారితీసిన కారణాలే. దంపతులు వారికున్న ఆరోగ్య సమస్యల ఆధారంగా, వైద్యుల సలహా మేరకు I.U.I, I.V.F, సరోగసి వంటి పద్ధతులను అవలంభిస్తుంటారు. ఆహారంలో మార్పులు, వ్యాయామం లేకపోవటం, ఒత్తిడి కారణం ఏదైనా ఏటికేడు స్త్రీ పురుషుల్లోనూ ఇన్ ఫెర్టిలిటీ సమస్యలు పెరుగుతున్నాయి. ప్రతి 6 జంటల్లో ఒకరు ఇన్ ఫెర్టిలిటీ సమస్యను ఎదుర్కొంటున్నారు. మన దేశంలోనూ వారి సంఖ్య లక్షల్లో ఉంది. అమ్మానాన్న అనే పిలుపు కోసం ఏం చేయడానికైనా ఎంత కష్టానికైనా సిద్ధం అనేలా ఉంటున్నాయి పరిస్థితులు. పిల్లలు లేరు అన్న బాధ ఒకటైతే, పిల్లలు లేరా? అన్న సమాజం ప్రశ్నలు వారిని మరింత కుంగదీస్తున్నాయి.
సరోగసి చట్టాలు ఇవే...
భారతదేశ ప్రభుత్వం 2021లో "సరోగసీ చట్టం"ను అమలులోకి తెచ్చింది. దీనిలో ఆర్థిక లాభం కోసం సరోగసీ నిషిద్ధం, కేవలం నిస్వార్థ లేదా పరోపకార సరోగసీకి మాత్రమే అనుమతి ఉంది. సరోగేట్ తల్లి దంపతులకు దగ్గరి బంధువై ఉండాలి, వయసు 25-35ల మధ్య ఉండాలి. దంపతులు వివాహితులు అయి, మహిళ వయసు 23-50, పురుషుడు 26-55 మధ్యలో ఉండాలి. డీఎన్ఏ రికార్డులు, మానసిక ఆరోగ్య తనిఖీలు తప్పనిసరి. సరోగసీ నియంత్రణ చట్టం-2021, సహాయత పునరుత్పాదక సాంకేతికత నియంత్రణ చట్టం-2021 వంటివి ఉన్నాయి. సరోగసీ నియంత్రణ చట్టం-2021 యాక్ట్‌ని 2024లో కొన్ని సవరణలు చేశారు. దీని ప్రకారం సరోగసీ ద్వారా సంతానం పొందాలనుకునే దంపతులకు పెళ్లయి ఐదేళ్లు పూర్తికావాలి. వీరికి గతంలో పిల్లలు, దత్తత తీసుకున్న సంతానం ఉండకూడదు. ఈ నిబంధనల ప్రకారం భర్తకు 26-55, భార్యకు 25-50 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. దంపతుల్లో ఒకరికి ఇన్ఫెర్టిలిటీ సమస్య ఉన్నట్టు జిల్లా మెడికల్ బోర్డు ధ్రువపత్రం తప్పకుండా తీసుకోవాలి. జన్మించిన బిడ్డ సంరక్షణ హక్కులకు మేజిస్ట్రేట్ అనుమతి తప్పనిసరిగా ఉండాలని నిబంధనలు చెబుతున్నాయి.
సరోగసీ రెగ్యులేషన్ యాక్ట్-2021
గర్భాన్ని అద్దెకిచ్చే మహిళకు వివాహమై ఒక బిడ్డకు జన్మనిచ్చి ఉండాలి. సదరు మహిళ ఒకసారి మాత్రమే అద్దెగర్భం ఇవ్వాలి. అది కూడా సమీప బంధువులకు మాత్రమే ఇవ్వాలి. ప్రసవానంతరం ఆ మహిళకు 16 నెలల బీమా సౌకర్యం కల్పించాలని సరోగసీ రెగ్యులేషన్ యాక్ట్-2021లో ఉంది. దాంతోపాటు గర్భాన్ని అద్దెకు ఇచ్చిన మహిళకు, ఆమె ప్రసవించబోయే బిడ్డకు మధ్య జన్యుపరమైన బంధమేదీ ఉండదని సర్వోన్నత న్యాయస్థానానికి కేంద్రం తెలిపింది.