రాష్ట్రంలో అకాల వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ(APSDMA) తెలిపింది. 3న రాయలసీమ, 4న ఉత్తరాంధ్ర జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని అంచనా వేసింది. పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాల్లో పని చేసే రైతులు, కూలీలు, పశువుల కాపరులు చెట్ల కింద ఉండొద్దని సూచించింది. మరోవైపు, నిన్న రాష్ట్రంలో అత్యధికంగా నంద్యాల జిల్లా గోస్పాడులో 40.3°C ఉష్ణోగ్రత నమోదైంది.
ఇక తెలంగాణలో నేటి నుంచి 3 రోజులపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. గంటకు 40 నుంచి 50 km వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అంచనా వేసింది. నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని పేర్కొంది. గద్వాల్, వనపర్తి, నారాయణపేట్, వికారాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో వడగళ్లతో కూడిన వర్షం కురుస్తుందని అంచనా వేసింది.