కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత రమేశ్ కార్తీక్ నాయక్ ఇంగ్లీష్ లో రాసిన 'లైఫ్ ఆన్ పేపర్' అనే కవితను విజయనగర శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం బళ్ళారి (కర్ణాటక) వారు తమ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంలో భాగంగా ఇంగ్లీష్- మొదటి సంవత్సరం, ఫస్ట్ సెమిస్టర్ లో పాఠ్యంశంగా తాజాగా పొందుపరిచారు.
రమేష్ కార్తిక్ నాయక్ రాసిన 'లైఫ్ ఆన్ పేపర్' ఒక గాఢమైన భావోద్వేగ కవిత. ఈ కవిత అస్తిత్వం, ఒంటరితనం, కవికి ఉండే బాధ్యత వంటి అంశాల గురించి ప్రస్తావిస్తుంది. కవి తాను విస్తృతమైన తెల్లటి కాగిత ప్రపంచంలో చిక్కుకుపోయినట్లుగా తన అనుభవాన్ని వర్ణిస్తాడు. రంగులు కోల్పోయిన తెల్లని నెమళ్లు, తెల్లగా ప్రవహించే రక్తం వంటి భావచిత్రాలు ఈ ప్రపంచంలోని నిర్మలత్వం చేసే ఉక్కిరిబిక్కిరిని ప్రతిబింబిస్తాయి. కవి తాను నిల్చున్న కాగితం క్రింద కూడా జీవితం ఉందని చెప్పుకొస్తాడు. తాను చెప్పే విషయాలకు కొన్ని ఆధారాలనిచ్చి మిగిలినది పాఠకులకు ఊహకు వదిలేస్తాడు. ఈ కవిత నాలుగు దృశ్యాలను సాక్షాత్కరిస్తుంది. ఆకలి, ఆదివాసీ, గిరిజనుల ప్రతిఘటన, దేవదూతలు త్యాగం, రచయితల, జర్నలిస్ట్ కలాలు మూగబోవడం ఇందులో ప్రముఖమైనవి.
రమేశ్ రాసిన 'బల్దేర్ బండి' కవిత్వ సంపుటిలోని 'జారేర్ బాటి' (జొన్న రొట్టెలు) అనే కవితను ఎస్.ఆర్ అండ్ బి.జి.ఎన్.ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ (SR&BGNR GOVT. ARTS & SCIENCE COLLEGE,AUTONOMOUS) ఖమ్మం వారు తమ డిగ్రీ కోర్సు 5వ సెమిస్టర్లో 2019లో పాఠ్యాంశంగా పొందుపరిచారు. ఆంధ్రా విశ్వవిద్యాలయం ఎంఏ తెలుగు 4వ సెమిస్టర్లో 'బల్దేర్ బండి' పుస్తకం మొత్తాన్ని యూనిట్ పాఠ్యాంశంగా 2021లోనే ప్రవేశపెట్టారు.
రమేశ్ నిజామాబాద్ జిల్లా, జక్రాన్ పల్లి తండా వాసి. తల్లిదండ్రులు వ్యవసాయదారులు. ఇతను తెలుగు, ఇంగ్లీష్ రెండు భాషల్లో రాయగలడు. ప్రస్తుతానికి హైదరాబాద్ లో జర్నలిస్ట్ కమ్ యాంకర్ గా ప్రముఖ ఛానెల్ లో పనిచేస్తున్నారు. చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ సూర్యా ధనంజయ్ గారితో కలిసి ‘బంజారా కథల’ సంకలనానికి సంపాదకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి సంపాదకత్వంలో 'కేసులా' బంజారా కథల సంకలనం విడుదలై సంచలనాన్ని సృష్టించింది. వర్ధమాన యువ రచయితల్లో రమేశ్ ఇప్పుడు ఒక ఆదర్శం.