రివ్యూ : మజాకా
ఆర్టిస్టులు : సందీప్ కిషన్, రీతూవర్మ, రావు రమేష్, అన్షు, మురళీశర్మ, రఘుబాబు, ఆది తదితరులు
ఎడిటర్ : చోటా కే ప్రసాద్
సంగీతం : లియోన్ జేమ్స్
సినిమాటోగ్రఫర్ : నిజర్ షఫీ
నిర్మాతలు : రాజేష్ దండా, ఉమేష్ కేఆర్ బన్సల్
దర్శకత్వం : త్రినాథరావు నక్కిన
రెగ్యులర్ ఫార్ములా కథలతోనే కమర్షియల్ విజయాలు అందుకునే దర్శకుడు త్రినాథరావు నక్కిన. అతనికి రచయిత బెజవాడ ప్రసన్న తోడు కావడంతో ఈ ద్వయం ఇప్పటి వరకూ మంచి విజయాలే ఇచ్చారు. తాజాగా వీరి కాంబినేషన్ లోనే సందీప్ కిషన్ హీరోగా రాజేశ్ దండా నిర్మించిన సినిమా మజాకా. ట్రైలర్ నుంచే రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్టైనర్ అనిపించుకున్న ఈ మూవీ శివరాత్రి సందర్భంగా విడుదలైంది. మరి ప్రమోషన్స్ లో మేకర్స్ చెప్పినంత ఫన్, ఎంటర్టైన్మెంట్ ఈ మూవీలో ఉందా లేదా అనేది చూద్దాం.
కథ :
వెంకట రమణ (రావు రమేష్)భార్య కొడుకు కృష్ణ (సందీప్ కిషన్) పుట్టగానే చనిపోతుంది. అప్పటి నుంచి తండ్రి కొడుకులే కలిసి ఉంటుంటారు. వీలైనంత త్వరగా వీరికి ఓ ఫ్యామిలీ ఫోటో ఉండాలని కొడుక్కి సంబంధాలు చూస్తుంటాడు వెంకీ. కానీ ఇద్దరూ మగవాళ్లే ఉండే ఇంటికి తమ అమ్మాయిని ఇవ్వం అని చెబుతుంటారంతా. దీంతో ముందు తండ్రి పెళ్లి చేసుకుంటే కొడుక్కీ అవుతుందని సలహా ఇస్తారు ఫ్రెండ్స్.కృష్ణ కాలేజ్ లో సత్య (రీతూవర్మ)ని ప్రేమిస్తుంటాడు. తను ఒప్పుకోదు.అయినా ప్రయత్నిస్తుంటాడు.ఇటు ఓ రోజు బస్టాండ్ లో యశోద(అన్షు)ను చూసి ప్రేమలో పడతాడు వెంకటరమణ.తను ముందు నో చెప్పినా ఓ 'ఫ్లాష్ బ్యాక్' తర్వాత ఓకే చెబుతుంది.అదే టైమ్ లో కృష్ణ ప్రేమ కూడా సక్సెస్ అవుతుంది. అలా తండ్రి కొడుకు ఇద్దరూ ఒకేసారి ఇద్దరు అమ్మాయిలను ప్రేమలో పడేస్తారు. ఇక పెళ్లే అనుకుంటోన్న టైమ్ లో అనుకోని ట్విస్ట్ ఎదురవుతుంది. ఎందుకంటే వీరు ప్రేమించిన అమ్మాయిలిద్దరూ ఒకే ఇంటి మనుషులు. మరి వారు ఎవరికి ఎవరు ఏమవుతారు. వీరి ప్రమేకథలో భార్గవ్ వర్మ(మురళీ శర్మ) ఇచ్చిన షాకులేంటీ.. అసలు వీరి లవ్ స్టోరీస్ సక్సెస్ అయ్యాయా లేదా అనేది మిగతా కథ.
ఎలా ఉంది :
సినిమా ఎలా ఉంది అనేది చూడటానికి ముందు ఆడియన్స్ అంతా ఈ కథలో ఎలాంటి లాజిక్స్ చూడము అని ఒట్టేసుకోవాలి. అప్పుడే ఎంజాయ్ చేయగలుగుతారు. ఎందుకంటే నెక్ట్స్ సీన్ ఏంటో ఆడియన్స్ కు ఇట్టే తెలిసిపోతుంటుంది. అంత సాధారణ రచనగా ఉంది మజాకా. హీరో లవ్ స్టోరీ కంటే హీరో తండ్రి లవ్ స్టోరీ ఎక్కువ ఎంటర్టైన్ చేస్తుంది. రావు రమేష్, అన్షు మధ్య వచ్చే ప్రతి సీన్ ఆకట్టుకుంటుంది. సందీప్ లవ్ స్టోరీలో కొత్తదనం లేకపోయినా అనవసమైన విలన్స్, హడావిడీ ఫైట్స్ లేకుండా నీట్ గా ముగించారు ఆ ప్రేమకథను. అయితే అన్షు, రీతూ అత్తా కోడళ్లు కావడం అసలు ట్విస్ట్ అయితే.. ఈఇద్దరికీ ఒకరంటే ఒకరికి అస్సలు పడకపోవడం.. వాళ్లు కలిస్తేనే పెళ్లి చేస్తా అని మురళీ శర్మ చెప్పడంతో అది చాలా సులువైన పని అనుకున్న తండ్రి కొడుకులకు వాళ్లు చాలా బద్ధ శతృవులు అని.. ఒకే ఇంట్లో కలిసి ఉండాల్సి వస్తే.. అసలే ప్రేమలే త్యాగం చేస్తా అనేంత వ్యతిరేకత ఉన్నవాళ్లుగా తెలుస్తుంది. దీంతో వారిని కన్విన్స్ చేసే క్రమంలో వచ్చే సీన్స్ వినోదాన్ని పంచుతాయి. ఆ సీన్స్ ఏంటో మనం ముందుగానే ఊహించేస్తాం. అయినా అలరిస్తాయి. ఓ కమర్షియల్ సినిమా టెంప్లేట్ ఇలాగే ఉండాలని ఎన్నో ఏళ్లుగా చూస్తోన్న ఫార్మాట్ ను ఏ మాత్రం మీరకుండా రాసుకున్న కథ కావడంతో కొన్నిచోట్ల విసుగునూ తెప్పించారు. అయితే ప్రీ క్లైమాక్స్ లో సెంటిమెంట్ సీన్స్ బాగా వర్కవుట్ అవుతాయి. అత్తా కోడళ్ల మధ్య ఉన్న రిలేషన్ ను బాగా ఎలివేట్ చేస్తూ ఇద్దరినీ కలిపేయడంతో కథ సుఖాంతం అవుతుందని ముందే తెలిసినా ఆ సీన్స్ లో ప్రేక్షకులను కదిలించడంలో మెప్పించారు. కాకపోతే కథలో ఎక్కడా కట్టిపడేసే కథనం కనిపించదు. బలమైన సంఘర్షణలు ఉండవు. అన్నీ హీరోలకు కావాల్సినట్టుగా ఆ టైమ్ కు అమరిపోతాయంతే. ఇలాంటి సిల్లీ కంటెంట్ కు ప్రిపేర్ అయితే ఎంజాయ్ చేస్తారు.
నటన పరంగా చూస్తే సందీప్ కిషన్ కామెడీ మూవీలో తనదైన ఈజ్ తో బాగా ఆకట్టుకున్నాడు. ఈ కథను బలంగా నమ్మాడని అతని కాన్ఫిడెన్స్ చూస్తే అర్థం అవుతుంది. రావు రమేష్ ఇప్పటి వరకూ చేసిన పాత్రలకు భిన్నమైన క్యారెక్టర్. పాటలున్నాయి. డ్యాన్సులూ చేశాడు. అవసరమైన చోట ఎమోషన్ నూ పండించాడు. అన్షు బాగా నటించింది. తన పాత్ర సర్ప్రైజ్ ఈ మూవీలో. రీతూ వర్మ ఎప్పట్లానే ఓకే. కానీ డ్యాన్సుల విషయంలో బాగా ఇబ్బంది పడుతున్న విషయం అర్థం అవుతుంది. కనిపించని సైకోగా మురళీ శర్మ పాత్ర బావుంది. అతనూ ఎంటర్టైన్ చేశాడు. రఘుబాబు, ఆది, శ్రీనివాస రెడ్డి వంటి వారివి రొటీన్ రోల్స్.
లియోన్ జేమ్స్ సంగీతంలోని పాటలు పెద్దగా ఆకట్టుకోలేదు. నేపథ్యం సంగీతం ఓకే. ఎలివేషన్స్ కు ఆస్కారం లేని కథనం కాబట్టి అతన్నీ అనాల్సిన అవసరం లేదు. సినిమాటోగ్రఫీ బావుంది. ఎడిటింగ్ ఓకే. డైలాగ్స్ ఫర్వాలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయి.ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా.. రచయితగా ప్రసన్న దర్శకుడుగా త్రినాథరావు పంథా మార్చాల్సిన టైమ్ వచ్చేసింది. మరీ ఈ స్థాయి నాసిరకం రచన, దర్శకత్వం అంటే ప్రతిసారీ వర్కవుట్ కాదు. ఇప్పుడు వాల్డ్ మూవీ ప్రేక్షకుల చేతుల్లో(సెల్ ఫోన్స్)లోనే ఉంటోంది. ఈ టైమ్ లో అవుట్ డేటెడ్ స్టోరీ, స్క్రీన్ ప్లే వాళ్లు యాక్సెప్ట్ చేస్తారా అనేది డౌటే. మరి ధమాకాలా మజాకా కూడా వర్కవుట్ అయితే ఈ సారి వీళ్లు గట్టెక్కిపోతారు. లేదంటే పంథా మార్చాల్సిందే.
ఫైనల్ గా : లాజిక్స్ వదిలేస్తే మజా వస్తుంది.
రేటింగ్ : 2.75 /5
- బాబురావు. కామళ్ల