Devendra Fadnavis: మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా గెలవదు: ఫడ్నవీస్

దేవేంద్ర ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు;

Update: 2024-10-28 04:15 GMT

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగా విజయం సాధించలేదని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం- బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ పేర్కొన్నారు. కానీ, అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని ఓ టీవీ చానెల్ నిర్వహించిన సదస్సులో ఆయన చెప్పారు. క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితుల ఆధారంగా ఆచరణాత్మకంగా వ్యవహరించాలని అన్నారు.

‘‘రాష్ట్రంలో బీజేపీ ఒంటరిగా విజయం సాధించలేదు.. కానీ, పెద్ద సంఖ్యలో సీట్లు, ఓటింగ్‌ శాతం పొందుతామనేది వాస్తవం. ఎన్నికల తర్వాత రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరిస్తుంది. మూడు పార్టీలు సాధించే ఓట్లతో తప్పకుండా ఎన్నికల్లో విజయం సాధించి అధికారం నిలబెట్టుకుంటా’’ అని దేవేంద్ర ఫడ్నవీస్‌ విశ్వాసం వ్యక్తం చేశారు.

పార్టీలో టికెట్‌ ఆశించి భంగపడిన నేతలు రెబల్స్‌గా మారే ప్రమాదం ఉందా? అన్న ప్రశ్నకు ఫడ్నవీస్‌ బదులిస్తూ.. కొందరు నేతలకు అవకాశం లభించకపోవడం కాస్త బాధగానే ఉంటుందని చెప్పారు. ఒక్కరిగా గెలుపు సాధ్యం కానప్పుడు ఇతర పార్టీలను కలుపుకోకతప్పదని, ఇలాంటప్పుడు సీట్ల సర్దుబాటులో రాజీ పడాల్సిందేనని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి అనేక సినిమాల్లో చూపించినట్లుగా.. ప్రతీ ఔత్సాహిక నటుడు ప్రధాన పాత్ర పోషించినట్లుగా ఉందని చమత్కరించారు. ఇదిలాఉంటే, అసెంబ్లీ ఎన్నికల్లో 288 స్థానాలకు గాను బీజేపీ 122 మంది అభ్యర్థులను ప్రకటించింది.

‘ఓటు-జీహాద్’ నినాదాన్ని పునరుద్ఘాటించిన ఫడ్నవీస్.. లోక్‌సభ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు వచ్చినా.. అవి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపవని వ్యాఖ్యానించారు. ‘ధూలే లోక్‌సభ స్థానంలోని మా అభ్యర్ధికి ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లలో మెజార్టీ వచ్చింది.. కానీ, మాలెగావ్‌ స్థానంలో ప్రత్యర్థికి వచ్చిన ఆధిక్యత వల్ల ఓడిపోయారు.. అసెంబ్లీ ఎన్నికల్లో అలా జరగదు.. ఆ ఐదు అసెంబ్లీ స్థానాల్లో మేము విజయం సాధిస్తాం’ అని అన్నారు. ఇక, 2019 ఎన్నికల్లో ఉమ్మడి శివసేన-బీజేపీ కలిసి పోటీచేసి విజయం సాధించాయి. కానీ, ప్రభుత్వ ఏర్పాటు విషయంలో విబేధాలు రావడంతో ఎన్డీయే నుంచి ఉద్ధవ్ ఠాక్రే బయటకొచ్చారు. అనంతరం కాంగ్రెస్-ఎన్సీపీ కూటమితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ ఎన్నికల్లో బీజేపీ 105, శివసేన 56, ఉమ్మడి ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 సీట్లను గెలుచుకున్నాయి. మహారాష్ట్రలో నవంబరు 20 ఎన్నికలు జరగనుండగా.. ఫలితాలను నవంబరు 23న వెల్లడిస్తారు.

Tags:    

Similar News