Budget 2022: మరికాసేపట్లో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు..
Budget 2022: మరికాసేపట్లో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.;
Budget 2022: మరికాసేపట్లో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 11 గంటలకు సెంట్రల్ హాల్‌లో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగిస్తారు. ఈ ఏడాది జులైతో రాష్ట్రపతి పదవీ కాలం ముగుస్తుంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌లో ఆయనకు ఇదే ఆఖరి ప్రసంగం కానుంది. రాష్ట్రపతి ప్రసంగం పూర్తైన అరగంట తర్వాత లోక్‌సభ సమావేశం కానుంది.
ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 ఆర్థిక సర్వే ప్రవేశపెట్టనున్నారు. మధ్యాహ్నం రెండున్నర గంటలకు రాజ్యసభ సమావేశం కానుంది. మంగళవారం ఉదయం 11 గంటలకు లోక్‌సభలో నిర్మలా సీతారామన్ 2022-23 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. రెండో తేదీ నుంచి నాలుగు రోజుల పాటు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే అంశంపై చర్చకు కేటాయించినట్లు లోక్‌సభ సెక్రటేరియట్ వర్గాలు వెల్లడించాయి.
ఫిబ్రవరి ఏడున ప్రధాని నరేంద్ర మోదీ చర్చకు సమాధానమిచ్చే అవకాశం ఉంది. ఈ సారి బడ్జెట్ సమావేశాలు రెండు దశల్లో జరగనున్నాయి. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు తొలి దశ, మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకు రెండో దశ సమావేశాలు నిర్వహించనున్నారు. సమావేశాల నిర్వహణ విషయంలో రాజకీయ పార్టీల అభిప్రాయాలు తెలుసుకోవడానికి పార్లమెంటరీ వ్యవహారాలమంత్రి ప్రహ్లాద్ జోషీ మధ్యాహ్నం 3 గంటలకు అఖిలపక్ష భేటీ నిర్వహించనున్నారు.
రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు సాయంత్రం 5 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అఖిలపక్ష నేతలతో సమావేశం కానున్నారు.పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అధికార పక్షాన్ని పలు అంశాల్లో నిలదీయడానికి విపక్షాలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకున్నాయి. గత శుక్రవారమే అధినేత్రి సోనియా గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్లమెంటరీ నాయకులు వర్చువల్‌గా సమావేశమై ఉభయసభల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.
భావసారూప్య పార్టీలను కలుపుకొని కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సభలో పోరాడాలని నిర్ణయించారు. పెగసస్ నిఘా వ్యవహారం, రైతాంగ సంక్షోభం, తూర్పు లద్ధాఖ్‌లో చైనా చొరబాట్లు, కొవిడ్ బాధితులకు పరిహారం, ఎయిర్ ఇండియా అమ్మకం, నిరుద్యోగం, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల వంటి అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయించారు.
రైల్వే ఉద్యోగాల నియామకాలపై యూపీ, బిహార్ రాష్ట్రాల్లో యువత పెద్ద ఎత్తున చేస్తున్న ఆందోళనను సభలోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ యోచిస్తోంది.పెగసస్ స్పైవేర్‌ను భారత్ 2017లోనే కొనుగోలు చేసిందని అమెరికాకు చెందిన న్యూయార్క్ టైమ్స్ సంచనల కథనం వెలువరించగా.. ఈ అంశం మరోమారు తెరపైకి వచ్చింది. పెగసస్ విషయంలో కేంద్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి సభను తప్పుదోవ పట్టించారని, ఆయనపై సభా హక్కుల ఉల్లంఘన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి.