Heavy Rains : పంజాబ్‌లో భారీ వర్షాలు.. 37 మంది మృతి

Update: 2025-09-04 08:45 GMT

ఈ ఏడాది దేశవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పంజాబ్ రాష్ట్రం తీవ్రంగా ప్రభావితమైంది. రాష్ట్రంలోని మొత్తం 23 జిల్లాల్లో వరదలు సంభవించాయి. దీని వల్ల 1.75 లక్షల హెక్టార్ల పంట నష్టం వాటిల్లింది. భారీ వర్షాలు, వరదల కారణంగా ఇప్పటివరకు రాష్ట్రంలో 37 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. నదులు, ప్రాజెక్టులలో నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఈ నెల 7వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.

వరద ప్రభావిత ప్రాంతమైన ఫిరోజ్‌పూర్‌లో ముఖ్యమంత్రి భగవంత్ మాన్, గవర్నర్ గులాబ్ చంద్ కటారియా వేర్వేరుగా పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. వరద ముంపు ప్రాంతాల్లో తక్షణ సహాయం కోసం పంజాబ్ ప్రభుత్వం రూ.71 కోట్లు ప్రకటించింది. అధికారులు, ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారని అధికారులు తెలిపారు.

వరద ప్రభావిత జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రాత్రింబవళ్లు సహాయక చర్యలు చేపడుతున్నాయి. అత్యవసర సహాయం కోసం దాదాపు 35 హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచినట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.

Tags:    

Similar News