JD Vance: నేటి నుంచి 4 రోజులు భారత్‌లో జేడీ వాన్స్ ఫ్యామిలీ ట్రిప్
సోమవారం ప్రధాని మోడీతో జేడీ వాన్స్ సమావేశం;
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కుటుంబం నేటి నుంచి నాలుగు రోజుల పాటు భారత్‌లో పర్యటించనున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచ దేశాలపై సుంకాలు పెంచేసిన తరుణంలో జేడీ వాన్స్ భారత్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. సోమవారం ఢిల్లీలో ప్రధాని మోడీతో జేడీ వాన్స్ భేటీకానున్నారు. ఈ సందర్భంగా సుంకాలపై ఇరువురు చర్చించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రాంతీయ భద్రతతో పాటు పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా జేడీ వాన్స్ దంపతులకు ప్రధాని మోడీ ప్రత్యేక విందు ఇవ్వనున్నారు. జేడీ వాన్స్ వెంట అమెరికా రక్షణ, విదేశాంగ శాఖలకు చెందిన ఐదుగురు అధికారులు ఉండనున్నారు.
సోమవారం ఉదయం 10 గంటలకు ఇటలీ నుంచి ఉషా వాన్స్, పిల్లలు ఇవాన్, వివేక్, మీరాబెల్‌లతో కలిసి జేడీ వాన్స్ భారత్‌కు చేరుకుంటారు. పాలం ఎయిర్‌బేస్‌లో సీనియర్ మంత్రి స్వాగతం పలకనున్నారు. ఐటీసీ మౌర్య షెరటన్ హోటల్‌లో విశ్రాంతి తీసుకున్నాక స్వామి నారాయణ్ అక్షర్‌ధామ్‌కు వెళ్లనున్నారు.
ఇక సోమవారం సాయంత్రం 6.30 గంటలకు వాన్స్ దంపతులకు లోక్‌కల్యాణ్ మార్గ్‌లోని తన నివాసంలో ప్రధాని మోడీ స్వాగతం పలుకుతారు. అనంతరం ఇరువురు నేతలు అధికారిక చర్చల్లో పాల్గొంటారు. భేటీ అనంతరం ప్రధాని విందు ఇవ్వనున్నారు. వాన్స్ దంపతులతో పాటు అమెరికా అధికారులు హాజరు కానున్నారు.
ఇక మంగళవారం రాజస్థాన్‌లో పర్యటించనున్నారు. మంగళవారం ఉదయం పలు చారిత్రక ప్రదేశాలను సందర్శిస్తారు. మధ్యాహ్నం రాజస్థాన్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో వాన్స్ ప్రసంగించనున్నారు. 23వ తేదీ ఉదయం వాన్స్ దంపతులు, పిల్లలు ఆగ్రాకు వెళ్తారు. తాజ్ మహల్ తర్వాత జయపురకు వెళ్తారు. 24వ తేదీన జయపుర నుంచి బయలుదేరి అమెరికా వెళ్తారు. ఇక జేడీ వాన్స్ రాక సందర్భంగా ఢిల్లీలో భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేశారు.