JYOTHI: విష "జ్యోతి" విపరీతాలు.. ఎంతకు తెగించింది
జ్యోతి మల్హోత్రా కేసులో సంచలన విషయాలు;
పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేస్తోందనే ఆరోపణలపై హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు విచారణలో సంచలన విషయాలు బహిర్గతం అవుతున్నాయి. పాకిస్తాన్ గూఢచర్య సంస్థ (పీఐఓ) భారత్‌కు వ్యతిరేకంగా ఆమెను సిద్ధం చేస్తోందని హర్యానాలోని హిసార్ పోలీసులు తెలిపారు. సరైన సమయంలో ఆమెను ప్రయోగించడానికి వారు ప్రయత్నించారని పోలీసులు గుర్తించారు. గూఢచర్యం కేసులో అరెస్టైన జ్యోతి మల్హోత్రా మూడుసార్లు పాకిస్తాన్‌కు వెళ్లింది. అదే సమయంలో ఆమె చైనాకు సైతం వెళ్లింది. చైనాతోనూ ఆమెకు ఉన్న లింకులపై త్వరలో తేల్చనున్నారు. పహల్గాం దాడికి ముందు ఆమె పహల్గాంను సైతం సందర్శించినట్లు పోలీసులు తెలిపారు. పహల్గాం సమాచారాన్ని పాక్ ఏజెంట్లకు చేరవేసి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. పాకిస్తాన్ ఐఎస్‌ఐతో సంబంధాలున్న ఆ దేశ హైకమిషన్ ఉద్యోగి డానిష్‌తో జ్యోతికి సన్నిహిత సంబంధాలున్నట్లు తెలిసింది. ‘ఆపరేషన్ సిందూర్’ అనంతరం నెలకొన్న ఉద్రిక్తతల సమయంలో ఆమె ఢిల్లీలోని పాక్ రాయబార కార్యాలయంలోని అధికారి డానిష్‌తో టచ్‌లో ఉన్నట్లు నిర్ధరించారు. జ్యోతిని అతడు ట్రాప్ చేసినట్లు గుర్తించారు. దీనిపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
పాక్ నుంచి జ్యోతికి నిధులు
‘జ్యోతి మల్హోత్రా "ట్రావెల్ విత్ జో" అనే యూట్యూబ్ ఛానెల్‌ను రన్ చేస్తోంది. ఆమె ఆదాయ వనరులను గుర్తించడానికి ఆమె ప్రయాణ చరిత్రతో పాటు ఆమె బ్యాంకు ఖాతాలు, లావాదేవీలను పరిశీలిస్తున్నాం. ఆమె ఆదాయానికి, ఖర్చుల మధ్య చాలా వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించాం. ఆమె కేవలం ఒక ట్రావెల్ బ్లాగర్ మాత్రమే. ఆదాయానికి మించి ఆస్తులు, ప్రాపర్టీస్ ఉన్నాయంటే ఆమెకు బయటి నుండి నిధులు సమకూరుతున్నాయనే అనుమానాలున్నాయి." అని ఎస్పీ శశాంక్ తెలిపారు.
మరో దేశ ద్రోహి అరెస్ట్
ఇదే కేసులో యూపీకి చెందిన షహజాద్ అనే వ్యక్తిని.. అధికారులు అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్‌లో ఉంటూ పాకిస్తాన్ కు కీలక సమాచారాన్ని అందిస్తున్నట్లు గుర్తించి అతన్ని అరెస్టు చేశారు. మరోవైపు..హైదరాబాద్‌లోనూ జ్యోతి మల్హోత్రా జాడలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. 2023 సెప్టెంబరులో ప్రధాని మోదీ వర్చువల్‌గా హైదరాబాద్-బెంగళూరు వందేభారత్ రైలును ప్రారంభించిన సమయంలో ఆమె హడావుడి చేశారు. ఆమె అరెస్ట్‌తో అప్పటి వీడియోలు వైరల్‌గా మారాయి.