Monkey Fever: కర్ణాటకను వణికిస్తున్న మంకీ ఫీవర్
ఇద్దరు మృతి.. 48 మంది గుర్తింపు;
కర్ణాటకను (Karnataka) మంకీ ఫీవర్ (Monkey Fever) వణికిస్తున్నది. ఇద్దరు మరణించడంతో రాష్ట్ర ఆరోగ్య శాఖాధికారులు అప్రమత్తమయ్యారు. ఈ వైరల్ ఇన్‌ఫెక్షన్ వ్యాప్తిని ఎదుర్కొనేందుకు చేపట్టవలసిన చర్యలపై సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో ఈ వ్యాధి వల్ల మొదటి మరణం జనవరి 8న శివమొగ్గ జిల్లా (Shivamogga District), హోసనగర్ తాలూకాలో సంభవించింది. 18 ఏండ్ల బాలిక ఈ వ్యాధితో ప్రాణాలు కోల్పోయింది. ఈ వ్యాధి కారణంగా మరణించిన రెండో వ్యక్తి ఉడుపి జిల్లాకు చెందిన 79 ఏండ్ల వృద్ధుడు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 49 పాజిటివ్ కేసులు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఉత్తర కన్నడలో 34 మంది, శివమొగ్గలో 12 మంది, చిక్కమగళూరులో ముగ్గురు ఈ వ్యాధితో బాధపడుతున్నారని చెప్పారు.
ఈ ఏడాదిలో ఇప్పటివరకు 2288 శాంపిళ్లను అధికారులు సేకరించారు. మంకీ ఫీవర్ కోతుల నుంచి మనుషులకు సోకుతుంది.కోతులను కరిచే కీటకాలు మనిషినీ కరిస్తే ఆ వ్యాధి సోకుతుంది. ఈ వ్యాధి సోకగానే తీవ్రమైన జ్వరం, ఒళ్లు నొప్పులు కనిపిస్తాయని రణదీప్ వివరించారు. ఈ మంకీ ఫీవర్‌కు ప్రాథమిక దశలోనే చికిత్స చేయించుకోవాలని తెలిపారు. టీకా కోసం ఐసీఎంఆర్ ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు వివరించారు.
కాగా, నాలుగేళ్ల కిందట కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా సాగర్ మండలంలోని అరళగోడు గ్రామంలో మంకీ ఫీవర్‌తో 26 మంది మరణించారు. ఆ తర్వాత మంకీ వైరస్‌తో చనిపోవడం ఇదే మొదటిసారి. మంకీ ఫీవర్ దక్షిణాసియాలో పక్షుల ద్వారా మనుషులకు సోకిన వైరల్ వ్యాధి. అధిక జ్వరం, ఒళ్లు నొప్పులతో దాదాపుగా డెంగీ లక్షణాలే ఉంటాయి. దీని కారణంగా 5 నుంచి 10 శాతం మరణాలు సంభవిస్తాయి. వాతావరణంలో మార్పుల వల్లే మంకీ ఫీవర్ వ్యాప్తి చెందుతున్నట్టు పరిశోధనల్లో వెల్లడయ్యింది.
ఈ వ్యాధి సోకకుండా వ్యాక్సిన్ వేయించేందుకు ఐసీఎంఆర్ ప్రతినిధులతో సంప్రదింపులు చేస్తున్నామని తెలిపారు. ప్రాథమిక దశలోనే చికిత్స చేయించుకోవాలని అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు. శివమొగ్గ జిల్లా క్యాసనూర్ గ్రామంలో ఎల్లో ఫీవర్ మాదిరిగా అంతుబట్టని వైరస్ ప్రబలి భారీగా ప్రాణనష్టం సంభవించింది. దీనిపై పరిశోధనలకు అమెరికాకు చెందిన రాక్‌ఫెల్లర్ ఫౌండేషన్.. 1950వ దశకంలో సాగర్‌లో ల్యాబ్, ఫీల్డ్ స్టేషన్ ఏర్పాటుచేసింది. చివరకు ఇది రష్యాలోని సైబీరియాలో బయటపడిన మంకీ ఫీవర్‌గా తేలింది.