President Election: రాష్ట్రపతి ఎన్నికలకు నోటిఫికేషన్.. ఏ క్షణాన్నైనా అభ్యర్థులను ప్రకటించనున్న పార్టీలు..

President Election: వచ్చే జులైలో జరిగే రాష్ట్రపతి ఎన్నికలకు నోటిఫికేషన్‌ వచ్చింది.

Update: 2022-06-09 09:00 GMT

President Election: వచ్చే జులైలో జరిగే రాష్ట్రపతి ఎన్నికలకు నోటిఫికేషన్‌ వచ్చింది. 2017 జులై 25న రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన రామ్‌నాథ్ కోవింద్ పదవీ కాలం ముగుస్తుండడంతో.. రాష్ట్రపతి ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసింది ఎలక్షన్ కమిషన్. ఈ ఎన్నికల్లో రాష్ట్రపతితో పాటు ఉపరాష్ట్రపతిని కూడా ఒకేసారి ఎన్నుకుంటారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేయడంతో బీజేపీ, కాంగ్రెస్‌ ఏ క్షణాన్నైనా తమ అభ్యర్థులను ఖరారు చేయనున్నాయి. రాష్ట్రపతి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ, కాంగ్రెస్‌.. ఆయా ప్రాంతీయ పార్టీలతో చర్చలు జరుపుతున్నాయి.

రాష్ట్రపతి ఎన్నికలు కాస్త విభిన్నంగా ఉంటాయి. రాష్ట్రపతిని అన్ని రాష్ట్రాల ఎంపీలు, ఎమ్మెల్యేలు పరోక్షంగా ఎన్నుకుంటారు. భారత రాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజ్ ఎన్నుకుంటుంది. పార్లమెంట్, అసెంబ్లీలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు సభ్యులుగా ఉండేదే ఈ ఎలక్టోరల్ కాలేజ్. ఇక్కడ రాజ్యసభ సభ్యులకు కూడా ఓటు వేసే హక్కు ఉంది. అసెంబ్లీ విషయానికొస్తే మాత్రం ఎమ్మెల్యేలకు తప్ప ఎమ్మెల్సీలకు ఓటు వేసే హక్కు ఉండదు. ఎలక్టోరల్ కాలేజీలో ఉండే సభ్యుల ఓటుకు ఒక విలువ ఉంటుంది. ఈ విలువ ఎంపీలకు ఒక విధంగా, ఎమ్మెల్యేలకు మరో విధంగా ఉంటుంది.

ప్రస్తుతం దేశంలోని అన్ని రాష్ట్రాల ఎమ్మెల్యేలు, ఎంపీల సంఖ్య 4వేల 896. ఎలక్టోరల్ కాలేజీ లెక్కల ప్రకారం దేశంలోని ఎమ్మెల్యేల ఓటు విలువ 5 లక్షల 49వేల 495. ఎంపీల ఓటు విలువను కూడా కలుపుకుంటే.. ఎలక్టోరల్ కాలేజీ మొత్తం ఓటు విలువ 10లక్షల 93వేల 347. రాష్ట్రపతి ఎన్నికలు ప్రపోషనల్ రిప్రెజంటేషన్ పద్ధతిలో సింగిల్ ట్రాన్సఫరబుల్ ఓటింగ్ విధానంలో జరుగుతాయి. అంటే ఎక్కువ ఓట్లు వచ్చినంత మాత్రాన గెలిచినట్లు కాదు. పోలైన ఓట్లలో సగం కంటే ఎక్కువ ఓట్లు రావాలి. అందుకే, ఓటర్లందరికీ ప్రాతినిధ్యం ఉండేలా చూస్తారు.

రాష్ట్రపతి అభ్యర్ధిగా నలుగురు పోటీ చేస్తే గనక.. వారిలో ఒకరికి మొదటి ప్రాధాన్యత ఓటు వేస్తారు. మిగిలిన ముగ్గురికి రెండో ప్రాధ్యానత, మూడో ప్రాధాన్యత, నాలుగో ప్రాధాన్యత కింద ఓట్లు వేస్తారు. ఇలా ప్రతి ఓటరూ తన ప్రాధాన్యత ప్రకారం ఓటు వేస్తూ వెళ్తారు. అయితే.. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారు గెలిచినట్లు కాదు కాబట్టి.. నిర్దేశిత కోటా కంటే ఎక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. ఈ కోటాను నిర్ణయించేందుకు పోలైన ఓట్లను 2తో భాగిస్తారు. అలా వచ్చిన సంఖ్యకు ఒకటి యాడ్ చేస్తారు. ఒకవేళ లక్ష ఓట్లు పోల్‌ అయితే గనక అందులో సగానికి కంటే ఎక్కువ ఓటు రావాలి.

అంటే పోలైన లక్ష ఓట్లకు గాను 50 వేలకు మించి ఒక్క ఓటు సాధించిన వ్యక్తే గెలుస్తారు. ఒకవేళ ఎవరికీ తొలి ప్రాధాన్యతా ఓట్లు రాకపోతే గనక.. మొదట ప్రాధాన్యతా ఓట్లు అత్యంత తక్కువగా వచ్చిన అభ్యర్థిని తొలగించి, ఆ అభ్యర్థికి వచ్చిన ఓట్లను మిగతా అభ్యర్థులకు పంచుతారు. ఇందులోనూ ఎవరూ గెలవకపోతే మళ్లీ కౌంటింగ్ చేపడతారు. ఇలా ఎవరో ఒక అభ్యర్థి గెలిచే వరకు లెక్కింపు జరుగుతుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం వర్తించదు. పార్టీలు విప్ జారీ చేయడానికి వీల్లేదు. సభ్యులు వారికి నచ్చిన అభ్యర్ధులకు ఓటు వేయొచ్చు. పైగా నోటా అనే ఆప్షన్ కూడా ఉండదు.

Tags:    

Similar News