జీ-7 దేశాల 50వ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ( Narendra Modi ) ఇవాళ ఇటలీ వెళ్లనున్నారు. మూడోసారి పీఎం పదవి చేపట్టాక మోదీకిది తొలి విదేశీ పర్యటన కావడం విశేషం. ఈ సమావేశాలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్, జపాన్ పీఎం ఫ్యూమియో కిషిడా, కెనడా పీఎం జస్టిన్ ట్రూడో తదితరులు హాజరుకానున్నారు. మూడు రోజులపాటు జరిగే ఈ సదస్సులో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, గాజా సంఘర్షణలపై చర్చించనున్నారు.
ఇటలీలో మోదీ గురువారం పర్యటన మొదలుకానున్న ఒక్క రోజు ముందే అక్కడి గాంధీజీ ప్రతిమ వద్ద ఖలిస్తానీ మద్దతుదారులు వేర్పాటువాద రాతలు రాశారు. కెనడాలో హత్యకు గురైన ఖలిస్తానీ వేర్పాటువాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ అనుకూల నినాదాలనూ ప్రతిమ పీఠం వద్ద నలుపురంగుతో రాశారు.
ప్రతిమను ఆవిష్కరించిన కొద్దిసేపటికే వేర్పాటువాదులు ఈ చర్యలకు తెగబడ్డారు. వేర్పాటువాదుల దుశ్చర్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. తగిన చర్యలు తీసుకోవాలని ఇటలీ అధికారులకు సూచించామని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ ఖ్వాత్రా చెప్పారు. వెంటనే స్థానిక యంత్రాంగం ఘటనాస్థలికి చేరుకుని ఖలిస్తానీ రాతలను తుడిచేసింది.