PM Modi : రైతులకు మోదీ దీపావళి గిఫ్ట్.. రూ. 35 వేల కోట్ల పథకాలు ప్రారంభం.
PM Modi : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీపావళి పండుగకు ముందు దేశంలోని రైతులకు భారీ శుభవార్త అందించారు. అక్టోబర్ 11, 2025న రైతుల కోసం ఏకంగా రూ. 35 వేల కోట్ల విలువైన కొత్త పథకాలను ప్రారంభించారు. ఈ పథకాలు వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసి, రైతుల ఆదాయాన్ని పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రధాని రెండు ముఖ్యమైన కార్యక్రమాలను ప్రారంభించారు. అవి ప్రధానమంత్రి ధన్-ధాన్య కృషి యోజన, దళాల స్వయం సమృద్ధి మిషన్.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రైతుల కోసం రెండు ప్రధాన మిషన్లను ప్రారంభించారు.
ప్రధానమంత్రి ధన్-ధాన్య కృషి యోజన: ఈ పథకం కింద దేశంలోని తక్కువ ఉత్పత్తి, వెనుకబడిన 100 జిల్లాలపై ప్రధానంగా దృష్టి సారిస్తారు. ఈ జిల్లాల్లో వ్యవసాయానికి ప్రోత్సాహం, రైతుల ఆదాయాన్ని మెరుగుపరచడం కోసం అనేక చర్యలు తీసుకుంటారు. నీటిపారుదల, నిల్వ, ఉత్పత్తి, వ్యవసాయ రుణాలు వంటి సౌకర్యాలను మెరుగుపరుస్తారు.
దళాల స్వయం సమృద్ధి మిషన్: ఈ మిషన్ ప్రధాన లక్ష్యం భారతదేశాన్ని పప్పు ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిగా మార్చడం. 2030-31 నాటికి పప్పు ధాన్యాల ఉత్పత్తిని ప్రస్తుతం ఉన్న 24.2 మిలియన్ టన్నుల నుంచి 35 మిలియన్ టన్నులకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం సాగు చేసే ప్రాంతాన్ని పెంచడంపై దృష్టి పెడతారు.
ఈ సందర్భంగా వ్యవసాయ రంగానికి సంబంధించిన 1,100కు పైగా కొత్త ప్రాజెక్టులను ప్రారంభించారు. శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టులు ప్రధానంగా పశుపోషణ, మత్స్య పరిశ్రమ, ఆహార శుద్ధి, వ్యవసాయ అనుబంధ మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించినవి. ఈ కార్యక్రమంలో ప్రధాని.. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, సహకార సంఘాలు, వ్యవసాయ రంగంలో కొత్త ఆవిష్కరణలు చేస్తున్న అగ్రి ఇన్నోవేటర్స్‌ను ప్రత్యేకంగా సన్మానించారు. ఈ ప్రభుత్వ కార్యక్రమం ద్వారా రైతులకు,గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు బహుముఖ ప్రయోజనాలు చేకూరనున్నాయి. ఈ పథకాలు రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తిని పెంచుకోవడానికి, తద్వారా ఆదాయాన్ని పెంచుకోవడానికి సహాయపడతాయి. కొత్త టెక్నాలజీని ఉపయోగించడానికి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి మద్దతు లభిస్తుంది.
వ్యవసాయంలో డిజిటలైజేషన్, ఆర్థిక మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంపై దృష్టి పెట్టడం ద్వారా రైతులకు సేవలు, ఆర్థిక సహాయం మరింత సులభంగా అందుతాయి. అలాగే, భారతీయ వ్యవసాయ ఉత్పత్తులు గ్లోబల్ మార్కెట్‌కు చేరుకోవడం, వాటి నాణ్యత మెరుగుపడడం జరుగుతుంది. ప్రధానమంత్రి మోదీ చేపట్టిన ఈ చొరవ, భారత వ్యవసాయ రంగంలో లాభదాయకమైన మార్పులు తీసుకురావడానికి, దేశాన్ని ఆహార భద్రతలో స్వయం సమృద్ధిగా మార్చడానికి ఉద్దేశించిన ఒక పెద్ద మిషన్‌గా చెప్పవచ్చు.