Vaccine For 15-18: 15 నుంచి18 ఏళ్ల వయసున్న పిల్లలకు నేటి నుంచి టీకా..
Vaccine For 15-18: దేశవ్యాప్తంగా 15 నుంచి18 ఏళ్ల వయసు ఉన్న పిల్లలకు నేటి నుంచి టీకా కార్యక్రమం ప్రారంభం కానుంది.;
Vaccine For 15-18 (tv5news.in)
Vaccine For 15-18: దేశవ్యాప్తంగా 15 నుంచి18 ఏళ్ల వయసు ఉన్న పిల్లలకు నేటి నుంచి టీకా కార్యక్రమం ప్రారంభం కానుంది. ఇప్పటికే వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ కోసం కొవిన్ పోర్టల్‌లో ప్రత్యేక స్లాట్ అందుబాటులోకి వచ్చింది. దీంతో కొవిన్ పోర్టల్‌లో టీకా కోసం పిల్లలు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. అలాగే వ్యాక్సిన్ కేంద్రాల్లో కూడా రిజిస్ట్రేషన్ జరుగుతోంది. పిల్లలకు కేవలం కొవాగ్జిన్ టీకా వేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సమాచారం ఇచ్చింది.
ఇందుకోసం కొవాగ్జిన్ అదనపు డోసులను సరఫరా చేయనుంది. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం.. పిల్లలు టీకా వేసుకొన్న తర్వాత అరగంట సేపు వ్యాక్సిన్ కేంద్రాల్లోనే ఉండాలి. వారిలో ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తున్నాయా అన్నది వైద్యులు పరిశీలించి పంపిస్తారు. రెండో డోసును 28 రోజుల తర్వాత వేస్తారు. పిల్లలకు టీకా నిర్ణయాన్ని తల్లిదండ్రులు స్వాగతిస్తున్నారు.
హెల్త్‌కేర్ వర్కర్లు, ఫ్రంట్‌లైన్ వర్కర్లు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వృద్ధులకు ఈ నెల 10 నుంచి మూడో డోసు వేయనున్నారు. దేశంలో కరోనా కేసులు భారీగా పెరగుతున్నాయి. గత 24 గంటల్లో 27 వేలకుపైగా కొత్త కరోనా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. కొత్త కేసుల్లో 21 శాతం పెరిగాయి. కొవిడ్‌తో చికిత్స పొందుతూ గడిచిన 24 గంటల్లో 284 మంది ప్రాణాలు కోల్పోయారు.
దీంతో ఇప్పటి వరకూ మృతి చెందిన వారి సంఖ్య 4 లక్షల 82వేలకు చేరింది. ఇదే సమయంలో ఒమిక్రాన్ కేసుల్లోనూ పెరుగుదల కనిపిస్తోంది. 23 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకూ ఒమిక్రాన్ విస్తరించింది. ఒమిక్రాన్ కేసుల సంఖ్య ఆదివారం 1525కి చేరింది. 460 కేసులతో మహారాష్ట్రతొలి స్థానంలో ఉండగా.. 351 ఒమిక్రాన్ కేసులతో ఢిల్లీ రెండో స్థానంలో ఉంది. గుజరాత్ 136, తమిళనాడు117, కేరళ 109 కేసులతో కొనసాగుతున్నాయి. తెలంగాణలో 67, ఏపీలో 17 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.ఒమిక్రాన్ నుంచి ఇప్పటి వరకూ 560 మంది కోలుకున్నట్లు వెల్లడించింది కేంద్ర ఆరోగ్యశాఖ.