Vinesh Phogat : దేశ ప్రజలకు వినేశ్ క్షమాపణలు చెప్పాలి : యోగేశ్వర్ దత్
రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌పై ( Vinesh Phogat ) బీజేపీ నేత, రెజ్లర్ యోగేశ్వర్ దత్ తీవ్ర విమర్శలు చేశారు. ఒలింపిక్స్‌లో అనర్హత అంశంపై ఆమెను తప్పుబట్టారు. దేశ ప్రజలకు వినేశ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఒలింపిక్స్‌లో బరువు పెరగడం ఆమె తప్పేనని, దీన్ని కుట్రగా పేర్కొనడం సరికాదన్నారు. ఒలింపిక్స్‌లో ఒక గ్రాము బరువు పెరిగినా అనర్హత వేటు పడుతుందని ఆమెకు తెలియదా? అని ప్రశ్నించారు. ఆమె స్థానంలో తాను ఉంటే ఎప్పుడో దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పేవాడినని అన్నారు. ఈ విషయంలో దేశ ప్రజలను వినేశ్ తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. ఏడాదికాలంగా ఆమె తెలుపుతున్న నిరసనలు, కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవ సమయంలో నిర్వహించిన మార్చ్‌లు కాంగ్రెస్ పథకంలో భాగంగానే చేశారని విమర్శించారు. దేశ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఆమె ప్రవర్తించారని మండిపడ్డారు. అధిక బరువు కారణంగా అనర్హత వేటు పడటంతో ఒలింపిక్స్ కల చెదిరిన స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ కుస్తీకి వీడ్కోలు పలికి, రాజకీయాల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆమె హరియాణాలోని జులానా అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈ స్థానం నుంచి వినేశ్‌కు గట్టి పోటీనిచ్చేందుకు బీజేపీ తరఫున యోగేశ్ బైరాగి పోటీ చేస్తున్నారు. మరోవైపు, ఆమ్‌ఆద్మీ పార్టీ కూడా తన అభ్యర్థిగా డబ్ల్యూడబ్ల్యూఈ మహిళా రెజ్లర్ కవితా దలాల్‌ను నిలబెట్టింది. దీంతో ఈ ఎన్నికల్లో జులానా రాజకీయ కుస్తీ దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది..