BCCI: గంభీర్ మార్పుపై స్పందించిన బీసీసీఐ
ఇలాంటి వార్తలు ఎలా వస్తాయని ప్రశ్నించిన దేవజిత్ సైకియా
గత కొద్ది రోజులుగా భారత క్రికెట్లో ఒకటే చర్చ. అన్ని ఫార్మాట్లకు కోచ్‌గా ఉన్న గౌతమ్ గంభీర్‌ను పరిమిత ఓవర్ల క్రికెట్‌కే పరిమితం చేస్తారంటూ వార్తలు హల్చల్ చేశాయి. టెస్టుల్లో అతడి పనితీరు సరిగా లేదనేది చాలా మంది చేస్తోన్న ఆరోపణలు. దీంతో బీసీసీఐ కొత్త కోచ్‌పై దృష్టి పెడుతుందని.. రెండు నెలల తర్వాత మార్పులు చేసే అవకాశం ఉందంటూ కథనాలు వచ్చాయి. గంభీర్ ప్రధాన కోచ్ అయ్యాక టీమ్ఇండియా టెస్టు సిరీస్‌లను కోల్పోయింది. దీంతో ఈ వార్తలకు బలం చేకూరింది. కానీ, బీసీసీఐ మాత్రం వాటిని కొట్టిపారేసింది. జాతీయ ఛానల్‌తో ప్రధాన కార్యదర్శి దేవజిత్ సైకియా ప్రత్యేకంగా మాట్లాడారు. లక్ష్మణ్‌తో చర్చలు జరిపినట్లు వచ్చిన వార్తలనూ ఖండించారు.
‘‘గౌతమ్ గంభీర్‌ను మారుస్తారని వస్తోన్న వార్తల్లో నిజం లేదు. అవన్నీ రూమర్లే. ఇప్పటి వరకు ఎలాంటి చర్చ జరగలేదు. కాంట్రాక్ట్ ప్రకారం గౌతమ్ గంభీర్ కొనసాగుతాడు. మేం ఎవరినీ సంప్రదించలేదు. గంభీర్‌తో కాంట్రాక్ట్ 2027 వన్డే ప్రపంచ కప్ వరకూ ఉంది. కోచింగ్ వ్యవస్థలో ఎలాంటి మార్పులు ఉండవు. గంభీర్‌పై మాకు నమ్మకముంది. అసలు ఇలాంటి వార్తలు ఎలా వస్తాయో కూడా అర్థం కావడం లేదు.అని సైకియా వ్యాఖ్యానించారు.
దేవుడు వరం ఇస్తే అదే కోరుకుంటా
నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఇన్స్టాగ్రామ్ వేదికగా కింగ్ కోహ్లీ గురించి గొప్పగా రాసుకొచ్చారు. కొత్త సంవత్సరం సందర్భంగా దేవుడు తనకు ఒక వరం ఇస్తే ఏం కోరుకుంటానో ఆయన వివరించారు."భగవంతుడు నాకు ఒక వరం ఇస్తే.. విరాట్ కోహ్లీని రిటైర్మెంట్ వెనక్కి తీసుకునేలా చేసి మళ్లీ టెస్టు క్రికెట్ ఆడేలా చేయమని అడుగుతాను. 150 కోట్ల జనాభా గల దేశానికి దీనికంటే గొప్ప సంతోషం ఏముంటుంది? కోహ్లీ ఫిట్నెస్ 20 ఏళ్ల కుర్రాడిలా ఉంటుంది. అతడు స్వచ్ఛమైన '24 క్యారెట్ల బంగారం' లాంటివాడు." అని సిద్ధూ పేర్కొన్నారు. ఇటీవల స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో భారత్ 0-2తో ఘోర పరాజయం పాలైంది. కష్టకాలంలో జట్టును ఆదుకునే విరాట్ కోహ్లీ వంటి ప్లేయర్ లేకపోవడం జట్టుపై స్పష్టంగా కనిపిస్తోంది. అభిమానులు కూడా విరాట్ కోహ్లీని తిరిగి టెస్టుల్లోకి రావాలని కోరుతున్నప్పటికీ, తాను ఇకపై భారత్ తరఫున కేవలం ఒక్క ఫార్మాట్ (వన్డే) మాత్రమే ఆడతానని కోహ్లీ స్పష్టం చేశారు. టెస్టు క్రికెట్లో భారత్ తరఫున అత్యంత విజయవంతమైన కెప్టెన్ విరాట్ కోహ్లీ.విరాట్ కోహ్లీ సారథ్యంలో భారత్ 40 టెస్టుల్లో విజయం సాధించింది. కోహ్లీ మళ్లీ టెస్టుల్లో ఆడాలన్న డిమాండ్ మరింత పెరుగుతోంది.