vaibhav: వైభవ్ టీమిండియా అరంగేట్రానికి ఐసీసీ బ్రేక్..!
ప్రపంచ క్రికెట్లో కొనసాగుతున్న వైభవ్ చర్చ... భారత జట్టులోకి వైభవ్ అరంగేట్రానికి ఐసీసీ బ్రేక్;
క్రికెట్ ప్రపంచంలో చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఎక్కడ చూసినా వైభవ్ గురించే చర్చ జరుగుతోంది. 14 ఏళ్ల వయస్సులోనే ఐపీఎల్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించి వైభవ్ సూర్యవంశీ క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాడు. కేవలం 35 బంతుల్లోనే సెంచరీ చేసి తన పేరును ఐపీఎల్ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నాడు. ఐపీఎల్‌లో సెంచరీ చేసిన అతి పిన్న వయష్కుడిగా వైభవ్ రికార్డులకెక్కాడు. అయితే వైభవ్ ఇక టీమిండియాకు సెలెక్ట్ కావడమే తర్వాయి అన్న చర్చ విపరీతంగా సాగుతోంది. అయితే భారత జట్టులోకి వైభవ్ అరంగేట్రానికి ఇంకా సమయం పడుతుందని తెలుస్తోంది. ఎందుకంటే వైభవ్ అరంగేట్రానికి ఐసీసీ నిబంధనలు ఆటంకంగా మారే అవకాశాలు ఉన్నాయి.
15 ఏళ్లు నిండితేనే...
వైభవ్ సూర్యవంశీకి భారత జట్టులో తక్షణ అవకాశం లభిస్తుందని, అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన అతిపిన్న వయస్కుడైన భారతీయుడిగా సచిన్ టెండూల్కర్ రికార్డును వైభవ్ సూర్యవంశీ అధిగమిస్తాడని అభిమానులలో అంచనాలు ఉన్నాయి. అయితే వైభవ్ సూర్యవంశీ వచ్చే ఏడాది వరకు భారత జట్టులో చేరలేడని తెలుస్తోంది. 2020లో అంతర్జాతీయ క్రికెట్ మండలి కొన్ని నియమాలను అమలు చేసింది. వాటిలో ఒకటి అంతర్జాతీయ పోటీలలో ఆడటానికి కనీస వయోపరిమితి. దీని ప్రకారం 15 ఏళ్ల వయస్సు ఉన్న ఆటగాళ్లు మాత్రమే అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఆడగలరు. ప్రస్తుతం 14 సంవత్సరాల వయస్సు ఉన్న వైభవ్ సూర్యవంశీ వెంటనే భారత జట్టులో పాల్గొనలేడు.
రోబో డాగ్‌తో బీసీసీఐకి కొత్త తలనొప్పులు
భారత క్రికెట్ నియంత్రణ మండలికి భారీ షాక్ తగిలింది. బీసీసీఐకి ఢిల్లీ హైకోర్టు నుంచి నోటీసులు వచ్చాయి. ఏప్రిల్ 13న రొబోటిక్ డాగ్‌ను నిర్వాహకులు పరిచయం చేశారు. ఈ రోబో కుక్కకు ఏప్రిల్ 20న ‘చంపక్’గా నామకరణం చేశారు. ‘చంపక్’ విషయంలో ఢిల్లీ ప్రెస్ పత్రా ప్రకాశన్ ప్రైవేట్ కంపెనీ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. 1968 నుంచి తాము ‘చంపక్’ పేరిట పిల్లల కోసం మ్యాగజీన్ ప్రచురిస్తున్నామని.. తమ అనుమతి లేకుండానే తమ ట్రేడ్‌మార్క్ వాడుకున్నారని కోర్టుకు విన్నవించింది. పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం ఈ విషయంపై వివరణ ఇవ్వాల్సిందిగా బీసీసీఐకి నోటీసులు ఇచ్చింది. నాలుగు వారాల్లో సమాధానంతో తమ ముందుకు రావాలని ఆదేశించింది. తదుపరి విచారణను జూలై 9కి వాయిదా వేసింది.