ఇంగ్లండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్ రిటైర్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది సెప్టెంబరునాటికి ఆయన తన 21 ఏళ్ల కెరీర్‌కు తెరవేయనున్నట్లు ఇంగ్లండ్ పత్రిక ‘ది గార్డియన్’ తెలిపింది. తాను యువ జట్టును నిర్మించాలని భావిస్తున్నానని కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్ అండర్సన్‌కు చెప్పినట్లు పేర్కొంది. ఆస్ట్రేలియాలో జరిగే యాషెస్ సిరీస్‌ను దృష్టిలో పెట్టుకుని బ్రెండన్ ఈ సూచన చేసినట్లు సమాచారం. కాగా ఇటీవలే భారత పర్యటన సందర్భంగా అండర్సన్.. టెస్టుల్లో 700 వికెట్లు తీసిన తొలి పేసర్‌గా రికార్డు సృష్టించాడు.
2002లో ఇంగ్లాండ్ తరఫున తొలిసారి బరిలోకి దిగిన అండర్సన్.. కీలక ప్లేయర్‌గా మారిపోయాడు. ఇప్పటివరు 187 టెస్టులు, 194 వన్డేలు, 19 టీ20ల్లో జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఇటీవలె టెస్టుల్లో 700 వికెట్ల మైలురాయిని దాటేశాడు. అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా కొనసాగుతున్నాడు.
అతడి కంటే ముందు ముత్తయ్య మురళీధరన్ (800), షేన్ వార్న్ (708)లు ఉన్నారు. రిటైర్మెంట్ నాటికి షేన్ వార్న్ రికార్డును అండర్సన్ బ్రేక్ చేస్తాడా? లేదా? అన్నది చూడాలి. ఇంగ్లండ్ క్రికెట్‌లో అండర్సన్‌కు ఓ పేజీ కచ్చితంగా ఉంటుందనే చెప్పాలి.