KABADDI WORLD CUP: కబడ్డీ ప్రపంచకప్ విజేత భారత్
ఫైనల్ మ్యాచ్‌లో పటిష్టమైన చైనా తైపేపై అద్భుత విజయం
భారత క్రీడా రంగంలో స్వర్ణ యుగం నడుస్తోంది. ప్రపంచ వేదికలపై భారత ఆటగాళ్లు సత్తాచాటుతున్నారు. వరుసగా ప్రపంచకప్‌లను సొంతం చేసుకుంటున్నారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిన జరిగిన మహిళల కబడ్డీ ప్రపంచ కప్ విజేతగా భారత్ నిలిచింది. భారత మహిళల కబడ్డీ జట్టు ఢాకా వేదికగా జరిగిన మహిళల కబడ్డీ వరల్డ్ కప్ 2025 టైటిల్‌ను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. ఫైనల్ మ్యాచ్‌లో పటిష్టమైన చైనా తైపేను 35–28 తేడాతో ఓడించి, భారత్ రెండోసారి విశ్వవిజేతగా నిలిచింది. ఈ టోర్నీలో భారత జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. గ్రూప్ దశ పోటీలన్నింటిలోనూ విజయం సాధించి సెమీఫైనల్‌కు చేరుకున్న భారత్, అక్కడ ఇరాన్‌ను 33–21 తేడాతో ఓడించి ఫైనల్లోకి అడుగుపెట్టింది. మరోవైపు, చైనా తైపే కూడా గ్రూప్ దశలో అజేయంగా ఉండి, సెమీస్‌లో ఆతిథ్య జట్టు బంగ్లాదేశ్‌ను 25–18 తేడాతో ఓడించి ఫైనల్‌లో భారత్‌ను ఢీకొంది. ఈ ఘన విజయం సాధించిన భారత మహిళా జట్టును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు.
వరుసగా...
ఇటీవలే భారత మహిళల క్రికెట్ జట్టు ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెర దింపుతూ వన్డే ప్రపంచ కప్‌ను సగర్వంగా ముద్దాడారు. ఆ సంబరాలు ఇంకా ముగియక ముందే అంధుల విభాగంలో అమ్మాయిలు టీ20 ప్రపంచ కప్ అందుకున్నారు. ఈ క్రమంలోనే కబడ్డీ జట్టు కూడా ప్రపంచ కప్ అందుకుంది.