Neeraj Chopra: ప్రపంచ అథ్లెటిక్స్ ఫైనల్‌కు నీరజ్ చోప్రా
పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత... కెరీర్‌లో నాలుగో బెస్ట్ నమోదు.;
టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతాక విజేత, భారత జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా(Neeraj Chopra ) మరోసారి తన సత్తా నిరూపించాడు. 88.77 మీటర్ల త్రోతో ప్రపంచ ఛాంపియన్ షిప్ ఫైనల్( World Championships final) లోకి ప్రవేశించి పారిస్ ఒలింపిక్స్ కు అర్హత(Neeraj Chopra qualifies for 2024 Paris Olympics) సాధించాడు. 2024 పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫైయింగ్ మార్క్ 85.50 మీటర్లు. క్వాలిఫైయింగ్ గ్రూప్ -ఏ లో పోటీపడిన చోప్రా ఇవాళ జరిగిన క్వాలిఫయర్స్ పోటీల్లో తొలి ప్రయత్నంలోనే 88.77 మీటర్లు బల్లెం విసిరి.. ఈ సీజన్ లోనే అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు. తన కెరీర్ లో నాల్గవ బెస్ట్ దూరానికి ఈటెను చోప్రా విసిరాడు.
నీరజ్‌తో పాటు మరో భారత జావెలిన్ స్టార్ డీపీ మను కూడా ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో నిలిచాడు. తొలుత 78.10 మీటర్ల దూరం జావెలిన్ విసిరిన మను.. 81.31 మీటర్లతో ఫినిష్ చేశాడు. ఈ ప్రదర్శనతో గ్రూప్- ఏ నుంచి మూడో స్థానంలో నిలిచాడు. ఈ గ్రూప్‌లో నీరజ్ అగ్రస్థానం కైవసం చేసుకుని 2024లో ప్యారిస్‌లో జరుగబోయే ఒలింపిక్స్‌లో బెర్త్‌ను ఖాయం చేసుకున్నాడు.
ఈ సీజన్‌లో దోహా డైమండ్ లీగ్‌లో నీరజ్ 88.07 మీటర్ల దూరం జావెలిన్ విసిరాడు. బుడాపెస్ట్ ఫీట్‌తో తన గత రికార్డును నీరజ్ అధిగమించాడు. స్టాక్‌హోంలో 2022లో జరిగిన డైమండ్ లీగ్‌లో తన కెరీర్‌లో అత్యుత్తమంగా నీరజ్ చోప్రా 89.94 మీటర్లు జావెలిన్ విసిరాడు. టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా స్వర్ణ పతకం సాధించి త్రివర్ణ పతాకాన్ని విశ్వవేదికపై రెపరెపలాడించాడు. పారిస్‌లోనూ అదే ప్రదర్శన పునరావృతం చేసి భారత్‌కు మరో పసిడి అందించాలని నీరజ్ సిద్ధమవుతున్నాడు. మరోసారి పసిడి సాధిస్తే ఆ ఘనత సాధించిన తొలి భారత అథ్లెట్‌గా నీరజ్ చరిత్ర సృష్టిస్తాడు.