CWC2023: పాక్ సెమీస్ ఆశలు సజీవం
ఫకర్ జమాన్ విధ్వంసం... డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో కివీస్ ఓటమి;
ప్రపంచకప్‌లో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్థాన్ డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో విజయం సాధించింది. మహా సంగ్రామంలో పాకిస్థాన్ నాలుగో విజయాన్ని అందుకుని సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్ డక్‌వర్త్ లూయిస్ ప్రకారం 21 పరుగుల తేడాతో గెలుపొందింది. పాక్ బ్యాటర్ ఫకార్ జమాన్ విధ్వంసంతో భారీ లక్ష్యాన్ని ఛేదించే దిశగా పయనించింది ఆ సమయంలో వర్షం అంతరాయం కలిగించడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో లక్ష్యాన్ని తగ్గించారు. అనంతరం మళ్లీ వర్షం పడడంతో పాక్ 21 పరుగుల తేడాతో గెలుపొందింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ భారీ స్కోరు చేసింది. అద్భుత ఫామ్‌లో ఉన్న రచిన్ రవీంద్ర మరో సెంచరీ చేశాడు. ఈ క్రమంలో 88 బంతుల్లోనే రచిన్ రవీంద్ర శతకం పూర్తి చేసుకున్నాడు. వరల్డ్‌కప్‌లో మూడు శతకాలు చేసిన న్యూజిలాండ్ బ్యాటర్‌గా రచిన్ కొత్త చరిత్ర సృష్టించాడు. సారధి కేన్ విలియమ్సన్ జట్టులోకి వచ్చి రావడంతోనే అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. రచిన్, విలియమ్సన్ 180 పరుగుల విలువైన భాగస్వామ్యం నమోదు చేయడంతో న్యూజిలాండ్ భారీ స్కోరు నమోదు చేసింది. అయితే 79 బంతుల్లో 10 ఫోర్లు, రెండు సిక్సులతో 95 పరుగులు చేసి శతకం దిశగా సాగుతున్న విలియమ్సన్‌ను ఇఫ్తికార్ అహ్మద్ అవుట్ చేశాడు. అనంతరం కాసేపటికే రచిన్ రవీంద్ర కూడా అవుటయ్యాడు. 95 బంతుల్లో 15 ఫోర్లు, 1 సిక్సుతో 108 పరుగులు చేసిన రచిన్‌ను మహ్మద్ వసీమ్ అవుట్ చేశాడు. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 401 పరుగులు చేసింది. మిచెల్ 29 పరుగులు, చాప్‌మన్ 39 పరుగులు, గ్లెన్ ఫిలిప్ 25 బంతుల్లోనే 41 పరుగులు చేయడంతో న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 401 పరుగులు చేసింది.
అనంతరం 402 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. జట్టు స్కోరు ఆరు పరుగులు చేరిందో లేదో అబ్దుల్లా షఫీక్ అవుటైపోయాడుఈ ఒక్క వికెట్ మినహా కివీస్ బౌలర్లు మరొక వికెట్ తీయలేకపోయారు. ఫకర్ జమాన్ న్యూజిలాండ్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ విధ్వంసం సృష్టించాడు. 63 బంతుల్లోనే ఫకర్ జమాన్ శతకం సాధించాడు. కేవలం 81 బంతుల్లో 11 సిక్సర్లు, 8 ఫోర్లతో 126 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. బాబర్ ఆజమ్ కూడా 63 బంతుల్లో 6 ఫోర్లు, రెండు సిక్సులతో 66 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 21.3 ఓవర్ల ఆట ముగిసిన తర్వాత వర్షం రావడంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. కాసేపటి తర్వాత వరుణుడు శాంతించడంతో పాక్ లక్ష్యాన్ని 41 ఓవర్లలో 341కి కుదించి ఆటను కొనసాగించారు. 25.3 ఓవర్ల ఆట పూర్తయిన తర్వాత మరోసారి వర్షం అంతరాయం కలిగించింది. అప్పటికి పాకిస్థాన్ 200/1 స్కోరు చేసింది. డక్‌వర్త్ లూయిస్ ప్రకారం పాక్ 25.3 ఓవర్లకు 179 పరుగులు చేయాలి. పాకిస్థాన్ అప్పటికే 21 పరుగుల ముందంజలో ఉండటంతో ఆ జట్టును విజేతగా ప్రకటించారు.