ICC WORLD CUP: నేటి నుంచే మహా సంగ్రామం
వన్డే ప్రపంచకప్ సంబరం నేటి నుంచే... ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మధ్య తొలి మ్యాచ్;
ప్రపంచ క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయం ఆసన్నమైంది. వన్డే క్రికెట్ మహా సంగ్రామానికి నేడు తెరలేవనుంది. ప్రపంచకప్‌ను ఒడిసిపట్టాలని ఏళ్ల తరబడి ప్రణాళికలు రచించిన జట్లు వాటిని అమలు చేసేందుకు సిద్ధమయ్యాయి. ఇవాళ(గురువారం) ప్రారంభంకానున్న ఈ మెగా టోర్నీ నవంబర్ 19 వరకు 46 రోజుల పాటు సాగనుంది. 2020-2023 వరల్డ్ కప్ సూపర్ లీగ్‌లో తొలి ఎనిమిది స్థానాల్లో నిలిచిన భారత్, ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా నేరుగా వన్డే ప్రపంచకప్‌నకు అర్హత సాధించాయి. క్వాలిఫయింగ్ పోటీల్లో సత్తా చాటిన శ్రీలంక, నెదర్లాండ్స్ ఈ మహా సమరంలో చేరాయి.
మొత్తం పది జట్లు ఈ మెగా టోర్నీలో పోటీ పడుతున్నాయి. వన్డే ప్రపంచకప్ మ్యాచ్‌లు పది వేదికల్లో జరగనున్నాయి. హైదరాబాద్, అహ్మదాబాద్, ధర్మశాల, దిల్లీ, చెన్నై, లఖ్‌నవూ, పుణె, బెంగళూరు, ముంబయి, కోల్‌కతాల్లో ఈ మెగాటోర్నీ జరగనుంది. వన్డే ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్, ఫైనల్ మ్యాచ్‌కు ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ మైదానమైన అహ్మదాబాద్ వేదిక కానుంది. కోల్‌కతా, ముంబయి ఒక్కో సెమీస్‌కు.. ఆతిథ్యం ఇస్తాయి. నవంబర్ 15న తొలి సెమీఫైనల్‌కు ముంబయి 16న రెండో సెమీఫైనల్‌కు కోల్‌కతా ఆతిథ్యమివ్వనుండగా.. నవంబర్ 19న ఫైనల్ అహ్మదాబాద్‌లో నిర్వహించనున్నారు. ఈ మెగా టోర్నీలో మొత్తం 45 లీగు మ్యాచ్‌లు] 3 నాకౌట్ మ్యాచులు ఉంటాయి. ఈ మెగా టోర్నీ రౌండ్ రాబిన్ ఫార్మాట్లో జరుగుతుంది. ప్రతి జట్టు మిగిలిన అన్ని జట్లతో తలపడుతుంది. అంటే తొమ్మిది లీగు మ్యాచులు ఆడతాయి. పాయింట్ల పట్టికలో మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి.
ఇవాళ అహ్మదాబాద్ వేదికగా డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ రన్నరప్ న్యూజిలాండ్ మధ్య తొలి పోరు జరగనుంది. అక్టోబర్ 8న చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరుగనున్న పోరుతో టీమ్‌ఇండియా ప్రపంచకప్ వేట ప్రారంభించనుంది. వన్డే వరల్డ్‌కప్ 2023 ప్రైజ్‌మనీని ICC భారీగా పెంచేసింది. మొత్తం ప్రైజ్ మనీని 83 కోట్ల రూపాయలుగా ప్రకటించింది. ఇందులో వరల్డ్‌కప్ విజేతకు 33 కోట్ల రూపాయలు.. రన్నరప్‌కు 16 కోట్ల రూపాయలు అందనున్నాయి. సెమీ ఫైనల్ చేరిన జట్లకు 6 కోట్లు.. గ్రూప్ స్టేజీలో నిష్క్రమించిన జట్లకు 82 లక్షల రూపాయలు... గ్రూప్ స్టేజీలో మ్యాచ్ గెలిచిన జట్టుకు 33 లక్షల రూపాయల ప్రైజ్‌మనీగా అందుతుంది. వరల్డ్‌కప్‌లో ఈ స్థాయిలో ప్రైజ్‌మనీ అందనుండటం ఇదే తొలిసారని ఐసీసీ తెలిపింది.