SHUTTLER: భారత షట్లర్లకు మిశ్రమ ఫలితాలు
మిక్స్‌డ్ డబుల్స్ ప్రీ-క్వార్టర్ ఫైనల్లో అదరగొట్టిన ధ్రువ్ కపిల, తనీషా క్రాస్టో ద్వయం;
ప్రతిష్ఠాత్మక మలేషియా మాస్టర్స్‌లో భారత షట్లర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల సింగిల్స్‌లో స్టార్ ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. ఐర్లాండ్ ఆటగాడు నాట్ గుయెన్‌తో జరిగిన మ్యాచ్‌లో కిదాంబి ఏకపక్ష విజయం సాధించాడు. తొలి రౌండ్‌లో లూ గాంజ్ జూను చిత్తు చేసిన కిదాంబీ శ్రీకాంత్... గురువారం కూడా అదే జోరు చూపించాడు. 33వ ర్యాంకర్ అయిన గుయెన్‌కు చుక్కలు చూపించాడు. తొలి సెట్‌ను 23-21తో గెలుచుకున్న శ్రీకాంత్.. రెండో సెట్‌లో మరింత చెలరేగాడు. రెండో సెట్‌లో 21-17తో గెలిచి శ్రీకాంత్ క్వార్టర్ ఫైనల్లో అడుగు పెట్టాడు.
మిక్స్‌డ్ డబుల్స్‌లోనూ...
మిక్స్‌డ్ డబుల్స్ ప్రీ-క్వార్టర్ ఫైనల్లోధ్రువ్ కపిల, తనీషా క్రాస్టో ద్వయం అదరగొట్టింది. ఫ్రాన్స్‌కు చెందిన జులియన్ మయివో లీ పలెమోపై మూడు సెట్ల పోరులో 21-17, 18-21, 21-15తో అలవోకగా గెలుపొందింది.అయితే.. కుర్రాళ్లు హెచ్ఎస్ ప్రణయ్ ఆయుశ్ శెట్టి, కరుణాకరన్‌లకు మాత్రం చుక్కెదురైంది. మలేషియా మాస్టర్స్‌లో ఫేవరెట్‌గా అడుగుపెట్టిన ప్రణయ్‌కు జపాన్ కుర్రాడు చెక్ పెట్టాడు. క్వార్టర్ ఫైనల్ పోరులో యుషి తనక ధాటికి చేతులెత్తేసిన భారత సంచలనం.. 9-21, 18-21తో ఓటమి పాలయ్యాడు. ఫ్రాన్స్ షట్లర్లు తొమా పొపోవ్ జోరకు ఆయుశ్ శెట్టి తలవంచగా .. క్రిస్టో పొపొవో చేతిలో కరుణాకరన్‌కు పరాజయం ఎదురైంది. మహిళల 16వ రౌండ్ డబుల్స్ మ్యాచ్‌లో ప్రేరణా అల్వేకర్, మృణ్మయి దేశ్‌పాండే ద్వయం విఫలమైంది.
ఒలింపిక్ విజేత పీవీ సింధు తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది. ఆక్సియాటా ఎరీనాలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో వియత్నాంకు చెందిన ఎంగుయెన్ తూయ్ లిన్ చేతిలో 21-11, 14-21, 21-15 తేడాతో సింధు ఓటమిపాలైంది. ఇది ఎంగుయెన్ చేతిలో సింధుకు వరుసగా రెండో ఓటమి కావడం గమనార్హం. ఈ ఏడాది ఆడిన ఐదు టోర్నీల్లో మొదటి రౌండ్‌లోనే నిష్క్రమించడం సింధుకు ఇది నాలుగోసారి. మహిళల సింగిల్స్ విభాగంలో మొదటి రౌండ్‌లోనే ఓడిన ఆమె.. మలేషియా మాస్టర్స్ 2025 టోర్నీ నుంచి నిష్క్రమించింది.