SIRAJ: సిరాజ్ మియా.. కమాల్ కియా
ఆఖరి టెస్టులో భారత్‌ను గెలిపించిన సిరాజ్... సిరాజ్ మ్యాజిక్‌తో 6 పరుగుల తేడాతో భారత్ గెలుపు.. 23 వికెట్లతో ఈ సిరీస్‌లో టాప్ వికెట్ టేకర్‌గా మియా;
మియా భాయ్ మహమ్మద్ సిరాజ్ సత్తా చాటాడు. చివరి టెస్టులో అద్భుతమే చేశాడు. ఓవల్ వేదికగా జరిగిన ఉత్కంఠభరిత మ్యాచులో భారత్ ను గెలిపించాడు. బుమ్రా లేకపోతే తాను ఎంత ప్రమాదకర బౌలర్‌నో మరోసారి క్రికెట్ ప్రపంచానికి చాటిచెప్పాడు. ఆల్మోస్ట్ చేయి దాటిపోయిన మ్యాచ్‌ని గెలిపించి టీమిండియా చరిత్రలో అతి గొప్ప విజయాన్ని అందించాడు. నరాలు తెగే ఉత్కంఠభరితంగా సాగిన ఓవల్ టెస్టు ఆఖరి రోజు మియా భాయ్ హీరో ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. సిరాజ్ స్వింగ్‌కి ఇంగ్లండ్ బ్యాటర్లతో ప్రేక్షకులు సైతం నోరెళ్లబెట్టారంటే అతిశయోక్తి కాదు. ఇద్దరు ఇంగ్లండ్ బ్యాటర్లు సెంచరీ చేసినప్పటికీ భారత్‌ను గెలిపించిన సిరాజ్‌కు క్రికెట్ లోకం సెల్యూట్ చేస్తోంది. ఈ సిరీస్‌లో 23 వికెట్లు తీసి టాప్ బౌలర్‌గా నిలిచాడు. . టెస్ట్ క్రికెట్ చరిత్రలో విదేశీ గడ్డపై జరిగిన ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో చివరి మ్యాచ్‌ను భారత్ గెలవడం ఇదే తొలిసారి. గతంలో భారత్ విదేశీ గడ్డపై 16 ఐదు టెస్ట్‌ల సిరీస్‌లను ఆడింది. వాటిలో చివరి టెస్ట్‌లో 6 సార్లు ఓడిపోయింది. చివరి టెస్ట్ మ్యాచ్ 10 సార్లు డ్రాగా ముగిసింది. ఇప్పుడు చివరకు భారత జట్టు విదేశాల్లో జరిగిన ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో చివరి మ్యాచ్‌ను గెలుచుకోవడంలో విజయం సాధించింది. భారత్ ఈ విజయం సాధించడానికి కారణం ముమ్మాటికి సిరాజే. ఆఖరి రోజు ఆటలో జెమీ ఓవర్టన్ దూకుడుగా రెండు బౌండరీలతో ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. కానీ, సిరాజ్ మ్యాజిక్ వెంటనే మొదలైంది. జెమీ స్మిత్‌ను (2) క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చి భారత శిబిరంలో ఆశలు రేకెత్తించాడు. తన మరుసటి ఓవర్లోనే దూకుడుగా ఆడుతున్న జెమీ ఓవర్టన్ను (9) వికెట్ల ముందు బోల్తా కొట్టించి ఇంగ్లండ్‌కు షాకిచ్చాడు. ఇక ప్రసిధ్ కృష్ణ కూడా తనవంతు పాత్ర పోషించాడు. జోష్ టంగ్‌ను (0) ఒక స్టన్నింగ్ యార్కర్‌తో క్లీన్ బౌల్డ్ చేసి మ్యాచ్‌ను మరింత ఉత్కంఠగా మార్చాడు. ఈ వికెట్ తర్వాత క్రిస్ వోక్స్ ఒంటి చేత్తో బ్యాటింగ్ చేసేందుకు సాహసం చేసి, అట్కిన్సన్ సహాయంతో జట్టు విజయం కోసం పోరాడాడు. ప్రసిధ్ కృష్ణ బౌలింగ్‌లో అట్కిన్సన్ మూడు పరుగులు చేసి మళ్ళీ స్ట్రైక్ తీసుకున్నాడు. కానీ, సిరాజ్ ఈసారి ఎలాంటి పొరపాటుకు తావివ్వకుండా అట్కిన్సన్ను క్లీన్ బౌల్డ్ చేసి, భారత విజయాన్ని లాంఛనం చేశాడు.
ఆయన వల్లే విజయం: సిరాజ్
దేవుడి దయ వల్లే ఇంగ్లండ్‌తో ఆఖరి టెస్ట్‌లో చిరస్మరణీయ విజయాన్నందుకున్నామని టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ అన్నాడు. బ్రూక్ క్యాచ్ వదిలేసిన తర్వాత తాము మ్యాచ్‌లో వెనుకబడిపోయామని, కానీ తాను మాత్రం గెలుపుపై ఆశలు వదులుకోలేదని సిరాజ్ స్పష్టం చేశాడు. ఆఖరి రోజు ఆట ప్రారంభానికి ముందు క్రికెటర్‌గా ఎదిగేందుకు తాను పడిన కష్టాన్ని గుర్తు చేసుకోవాలని రవీంద్ర జడేజా సూచించాడని, ఆ మాటలు తనను మోటివేట్ చేసాయని తెలిపాడు. ఈ మ్యాచ్ గెలుపుపై తాను ఆశలు కోల్పోలేదని చెప్పాడు. 'ఏది ఏమైనా సరైన ప్రదేశంలో బౌలింగ్ చేయాలనే ప్లాన్‌తో బరిలోకి దిగాను. వికెట్లు పడినా.. పరుగులు వచ్చినా నేను పట్టించుకోలేదు. బ్రూక్ క్యాచ్ తీసుకున్నప్పుడు బౌండరీ లైన్‌ను తాకుతానని నేను ఊహించలేదు. అది మ్యాచ్‌ను మలుపు తిప్పే క్షణం. ఆ అవకాశంతో బ్రూక్ టీ20 మూడ్‌లోకి వెళ్లిపోయాడు. దాంతో మేం ఆటలో వెనుకంజలో నిలిచాం. కానీ ఆ దేవుడి దయ వల్ల నేను ఏ పాయింట్లోనూ విజయంపై విశ్వాసం కోల్పోలేదు. ఈ ఊదయం కూడా అదే నమ్మకంతో బౌలింగ్ చేశాను.'అని సిరాజ్ చెప్పుకొచ్చాడు.