వెస్టిండీస్ పర్యటనకు దేశవాళీ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్‌ని ఎంపిక చేయకపోవడంతో పలువురు మాజీ క్రీడాకారులు, ముఖ్యంగా సునీల్ గవాస్కర్ సెలెక్టర్లపై తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. అయితే బీసీసీఐ కి చెందిన అధికారులు మాత్రం సర్ఫరాజ్‌ని తప్పించడానికి వేరే కారణాలు ఉన్నాయని తెలిపారు. క్రికెటేతర అంశాలు ఈ నిర్ణయానికి దోహదపడ్డాయన్నారు. సర్ఫరాజ్ ఫిట్‌నెట్, మైదానం బయట అతడి ప్రవర్తన బట్టే ఈ నిర్ణయం తీసుకున్నారని వారంటున్నారు. ఆటగాళ్లను కేవలం ఐపీల్ ప్రదర్శన ఆధారంగానే ఎంపిక చేస్తామనుకోవడం కరెక్ట్ కాదన్నారు.
"మైదానం వెలుపలా, బయటా అతను వ్యవహరించే తీరు జట్టులో ఎంపిక కాకపోవడానికి కారణం అయి ఉండొచ్చు. మ్యాచ్‌లో అతను చేసిన సంజ్ణలు, ఇతర సందర్భాల్లో ప్రవర్తించిన తీరుని గమనించారు. కొంచెం క్రమశిక్షణతో కూడిన ఆట అతడికి మరిన్ని అవకాశాలు తెస్తుంది. తన తండ్రి, కోచ్‌తో ఈ అంశాలతో చర్చించి మెరుగుపరుచుకుంటాడని ఆశిస్తున్నాం" అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ సీనియర్ అధికారి ఆశాభావం వ్యక్తం చేశాడు.
అయితే ఇటీవల రంజీ మ్యాచుల్లో సర్ఫరాజ్ సెంచరీ చేశాడు. మ్యాచ్ చూస్తున్న సెలెక్టన్ కమిటీ ఛైర్మన్ చేతన్ శర్మ ముందు ఇబ్బందికరంగా సంబరాలు నిర్వహించుకున్నాడు. 2022 లో రంజీ ఫైనల్‌లో కూడా ఇలాగే చేశాడు.
ఐపీల్ ప్రదర్శన, షార్ట్ బాల్స్ ఆడటంలో అతని బలహీతనలు కారణం కాదన్నారు.
"వరుస సీజన్లలో 900 పరుగులు సాధించిన ఆటగాడిని ఎంపికచేయకపోయేంత మూర్ఖులు కాదు సెలెక్టర్లు. అంతర్జాతీయ స్థాయి ఫిట్‌నెస్ ప్రమాణాలు సర్ఫరాజ్‌లో లేవు. అతని దీనిపై దృష్టిసారించి కసరత్తు చేయాలి. " అని హితవు పలికాడు.
ఇంతకు ముందు జట్టులోకి వచ్చిన మయాంక్ అగర్వాల్ ఒకే నెలలో 1000 పరుగులు చేశాడు. ఇదే విషయం హనుమా విహారీకి కూడా వర్తిస్తుంది. వీరిని ఐపీల్ ప్రదర్శన ఆధారంగా ఎంపికలు చేయలేదు కదా..? అని వివరించాడు.
25 యేళ్ల సర్ఫరాజ్‌కి దేశావాళీ క్రికెట్‌లో అద్భుతమైన రికార్డ్ ఉంది. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 32 మ్యాచుల్లో 79.65 సగటుతో 3505 పరుగులు సాధించాడు. చివరి 3 రంజీ సీజన్లలో వరుసగా 928, 982, 656 పరుగులతో మొత్తం 2566 పరుగులు చేశాడు.