TEAM INDIA: ఉత్కంఠ పోరులో భారత్ జయకేతనం
తొలి వన్డేలో కివీస్‌పై భారత్ విజయం... మరోసారి కోహ్లీ క్లాస్ ఇన్నింగ్స్... చెలరేగిపోతున్న విరాట్ కోహ్లీ
న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భారత జట్టు అద్భుతమైన శుభారంభం చేసింది. తొలి వన్డేలో చివరి వరకు ఉత్కంఠ రేపిన పోరులో, భారత్ నాలుగు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. 300 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించాల్సిన పరిస్థితిలోనూ భారత బ్యాటింగ్ లైనప్ ఒత్తిడిని తట్టుకుని నిలబడింది. ముఖ్యంగా విరాట్ కోహ్లి నేతృత్వంలోని మధ్య వరుస బ్యాటింగ్, చివర్లో కేఎల్ రాహుల్ – హర్షిత్ రాణా చివర్లో బ్యాటు ఝుళిపించడంతో భారత్‌కు విజయం దక్కింది. సిరీస్‌లో 1–0 ఆధిక్యం సాధించిన భారత్, రెండో వన్డేకు మరింత ఆత్మవిశ్వాసంతో సిద్ధమవుతోంది.
మిచెల్ దూకుడు
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ మంచి ఆరంభమే దక్కింది. హెన్రీ నికోల్స్, డెవాన్ కాన్వే జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. భారత బౌలర్లు తొలి ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో స్కోరు వేగం తక్కువగా ఉన్నప్పటికీ, క్రీజులో కుదురుకున్న తర్వాత కివీస్ ఓపెనర్లు బ్యాట్లు ఝళిపించారు. హెన్రీ నికోల్స్ 62 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడగా, కాన్వే 56 పరుగులతో అతనికి చక్కటి మద్దతిచ్చాడు. అయితే అసలైన ఇన్నింగ్స్‌ను నిలబెట్టింది డరెల్ మిచెల్. భారత బౌలర్లు వికెట్లు తీస్తున్నా, మరో ఎండ్‌లో మిచెల్ మాత్రం స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. 71 బంతుల్లో 84 పరుగులు చేసిన మిచెల్, ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లతో భారత్‌పై ఒత్తిడి పెంచాడు. భారత బౌలర్లలో సిరాజ్ రెండు వికెట్లు తీశాడు. హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ తలా రెండు వికెట్లు సాధించినప్పటికీ, చివరి ఓవర్లలో ఎక్కువ పరుగులు ఇచ్చారు. చివరకు న్యూజిలాండ్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 300 పరుగులు చేసింది.
కోహ్లి క్లాస్
300 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారతజట్టుకు ఆరంభం నెమ్మదిగానే సాగింది. కైల్ జేమీసన్, ఫౌక్స్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో తొలి ఐదు ఓవర్లలో కేవలం 15 పరుగులకే భారత్‌ను పరిమితం చేశారు. అయితే ఆ తర్వాత రోహిత్ శర్మ కొన్ని దూకుడు షాట్లతో స్కోరు బోర్డును కదిలించాడు. జేమీసన్ బౌలింగ్‌లో సిక్సర్, ఫోర్ కొట్టిన రోహిత్ ఊపుమీద ఉన్న సమయంలోనే అదే బౌలర్ చేతిలో ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ క్లాస్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. మరో ఎండ్‌లో గిల్ ఆచితూచి ఆడుతూ భాగస్వామ్యాన్ని నిర్మించాడు. కోహ్లి తొలి నుంచే బౌండరీలు కొడుతూ స్కోరు వేగాన్ని పెంచగా, గిల్ నెమ్మదిగా కానీ స్థిరంగా ముందుకు సాగాడు. ఈ జోడీ రెండో వికెట్‌కు 118 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పింది. కోహ్లి అర్ధశతకం పూర్తి చేసిన తర్వాత మరింత దూకుడుగా ఆడగా, గిల్ కూడా తన అర్ధశతకాన్ని అందుకున్నాడు. అయితే 56 పరుగుల వద్ద గిల్ ఔటవడంతో భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ క్రీజులోకి వచ్చి ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేశాడు. గాయం కారణంగా కొంతకాలం ఆటకు దూరమైన శ్రేయస్, ఈ మ్యాచ్‌లో తన ఫామ్‌ను చాటాడు. కోహ్లితో కలిసి మూడో వికెట్‌కు 77 పరుగులు జోడించి భారత్‌ను విజయానికి చేరువ చేశాడు. 39 ఓవర్లకు భారత్ స్కోరు 234/2. కోహ్లి 93 పరుగులతో సెంచరీకి చేరువయ్యాడు. సెంచరీ లాంఛనమే అనుకున్న సమయంలో, జేమీసన్ బౌలింగ్‌లో అనవసర షాట్‌కు ప్రయత్నించి కోహ్లి ఔటయ్యాడు.