TEAM INDIA: పాకిస్తాన్ కంటే కిందకు దిగజారిన భారత్
సౌతాఫ్రికాపై టెస్టు సిరీస్ ఓడిన భారత్... డబ్ల్యూటీసీలో రెండో స్థానానికి ప్రొటీస్..ఐదో స్థానానికి దిగజారిన టీమిండియా
వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ టైటిల్ టీమిండియాకు కలగానే మిగిలిపోయేలా ఉంది. వరుసగా రెండుసార్లు ఫైనల్ చేరినా భారత్ టైటిల్ సొంతం చేసుకోలేక పోయింది. సౌతాఫ్రికా చేతిలో వైట్ వాష్‌తో పాయింట్ల పట్టికలో కిందకు పడిపోయింది. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా టాప్‌లో ఉండగా.. భారత్ పాకిస్తాన్ కంటే వెనుకబడి ఐదో స్థానంలో ఉంది. సొంతగడ్డపై కూడా టీమిండియా సిరీస్ ఓడిపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. గంభీర్ నేతృత్వంలో టీమిండియా టెస్టుల్లో దిగజారుతోంది.
పాయింట్ల పట్టికలో పతనం
సౌతాఫ్రికాతో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో వైట్ వాష్‌కు గురైన భారత్ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్ల టేబుల్లోనూ కిందకు దిగజారింది. ఎప్పుడూ టాప్ - 3లో కనిపించే టీమిండియా ఈ సారి ఏకంగా పాకిస్తాన్ కంటే కిందకు దిగజారింది. భారత్‌పై క్లీన్ స్వీప్ చేసిన సౌతాఫ్రికా మాత్రం రెండో స్థానంలో ఫిక్సయింది. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా జట్టు టాప్ ప్లేస్‌లో ఉంది. ఆసీస్ ఆడిన నాలుగు టెస్టుల్లోనూ విజయం సాధించి వంద శాతంతో మొదటి స్థానంలో కొనసాగుతోంది. సౌతాఫ్రికా జట్టు నాలుగు టెస్టులు ఆడి మూడు గెలిచి రెండో స్థానంలో ఉంది. శ్రీలంక జట్టు రెండు టెస్టులు ఆడి ఒకదాంట్లో గెలిచి మూడో స్థానంలో నిలిచింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ జట్టు ఆడిన రెండు టెస్టుల్లో ఒకటి గెలిచి నాలుగులో ఉండగా, భారత జట్టు తొమ్మిది టెస్టులు ఆడి నాలుగు విజయాలు, నాలుగు ఓటములతో ఐదో స్థానానికి పడిపోయింది. ఆ తర్వాత ఇంగ్లండ్, బంగ్లాదేశ్, వెస్టిండీస్ జట్లు ఉన్నాయి. న్యూజిలాండ్ ఇప్పటివరకు ఒక్క టెస్టు కూడా ఆడలేదు.
గంభీర్ డౌన్ డౌన్ అంటూ...
గువాహటి వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత్ ఏకంగా 400కు పైగా పరుగులతో ఘోర ఓటమిపాలయింది. దాంతో సహనం కోల్పోయిన టీమిండియా ఫ్యాన్స్ గౌతమ్ గంభీర్‌ను టార్గెట్ చేశారు. మ్యాచ్ అనంతరం ప్రజంటేషన్ సమయంలో టీమిండియా స్క్వాడ్, కోచింగ్ స్టాఫ్ అందరూ గ్రౌండ్లోకి వచ్చారు. గంభీర్‌ను గ్రౌండ్లో చూసిన ఫ్యాన్స్ ఒక్కసారిగా కోపంతో ఊగిపోయారు. ఒకతను గంభీర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు పలకడంతో.. మిగతా అభిమానులు కూడా అందుకుని డౌన్ డౌన్ అంటూ రెచ్చిపోయారు. స్టేడియంలో ఉన్న భారత జట్టు అభిమానులు అందరూ ఒక్కసారిగా సహనం కోల్పోయి గంభీర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయడం మొదలుపెట్టారు. అయితే, అక్కడే ఉన్న గౌతమ్ గంభీర్ నేలచూపులు వేస్తూ ఏం చేయలేక నిశ్శబ్దంగా తల దించుకున్నాడు. అయినా కూడా ఫ్యాన్స్‌కి గంభీర్‌పై కోపం తగ్గకపోవడంతో గట్టిగా నినాదాలు చేశారు.
అందరి వేళ్లూ గంభీర్ వైపే
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ వైట్ వాష్ అయిన తర్వాత ఇప్పుడు అందరి వేళ్లూ టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వైపే చూయిస్తున్నాయి. గంభీర్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారత్ వేదికగా జరిగిన చివరి మూడు టెస్టుల్లో రెండు వైట్ వాష్ అయింది. న్యూజిలాండ్‌పై మూడు, సౌతాఫ్రికాపై రెండు టెస్టుల్లో కనీసం డ్రా కూడా చేయలేకపోయింది. జట్టులో మార్పులు, సీనియర్ల తొలగింపు, బ్యాటింగ్ ఆర్డర్లో ప్రయోగాలతో గౌతమ్ గంభీర్ టీమిండియా టెస్టు ప్రాభవాన్ని దెబ్బతీశాడంటూ ఇప్పటికే ఫ్యాన్స్ ఆగ్రహంలో ఉన్నారు.