TEAM INDIA: సూర్య సేన దారిలోనే భారత మహిళల జట్టు
పాకిస్థాన్‌తో ఈనెల 5న భారత్ మ్యాచ్... మహిళా వరల్డ్ కప్‌లో కీలక పోరు.. షేక్ హ్యాండ్ ఇవ్వకూడదని నిర్ణయం
వన్డే ప్రపంచ కప్ తొలి మ్యాచులో భారత మహిళ జట్టు శుభారంభం చేసింది. మొదట తడబడినా...తరువాత నిలబడి శ్రీలంక మీద 60 పరుగుల తేడాతో గెలిచింది. దీప్తి శర్మ, అమన్ జ్యోత్ లు జట్టును విజయతీరాల వైపు నడిపించారు. తొలి మ్యాచ్ విజయంతో మంచి ఊపుమీదున్న టీమిండియా రెండో మ్యాచుకు సిద్ధమైంది. అది దాయాది పాకిస్థాన్ తో. కొలంబో వేదికగా పాకిస్థాన్‌తో జరిగే కీలకమైన మ్యాచుకు టీమిండియా సిద్ధమైంది. ఈ మ్యాచుపై ఉత్కంఠ నెలకొంది.
కీలక మ్యాచ్
ఆసియా కప్‌లో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన హోరాహోరీ పోరును చూసిన అభిమానులకు మరోసారి అలాంటి ఉత్కంఠభరిత మ్యాచ్‌ను చూసే అవకాశం వచ్చింది. ఆసియా కప్‌లో పురుషుల జట్లు తలపడగా, ఇప్పుడు మహిళల వన్డే ప్రపంచ కప్‌లో ఈ రెండు దేశాల జట్లు ఎదురెదురుగా నిలవనున్నాయి. ఈసారి కూడా హై-వోల్టేజ్ పోరును ఆశించవచ్చు. ఈ నేపథ్యంలో బీసీసీఐ భారత మహిళల క్రికెట్ జట్టుకు పాకిస్తాన్ ఆటగాళ్లతో షేక్ హ్యాండ్ చేయవద్దని ఆదేశించినట్లు వార్తలు వెలువడ్డాయి. బీసీసీఐ కార్యదర్శి దేవ్జీత్ సైకియా పాకిస్తాన్‌ను శత్రు దేశంగా ప్రకటించిన తర్వాత ఈ నిర్ణయం రావడంతో, ఈ మ్యాచ్ మరింత ఉత్కంఠగా మారింది. భారత, పాకిస్తాన్ మహిళా జట్లు ఈ ఆదివారం తలపడనున్నాయి. బీసీసీఐ భారత మహిళా జట్టుకు పాకిస్తాన్ ఆటగాళ్లతో షేక్‌హ్యాండ్ ఇవ్వవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 1న ఈ సందేశాన్ని టీమిండియాకు పంపినట్లు నివేదించబడింది.
భారత్ కు ఎదురే లేదు
భారత్, శ్రీలంక సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచ కప్ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ ఐసీసీ ఈవెంట్లో, భారత్, పాకిస్తాన్ మహిళా జట్ల మధ్య క్రికెట్ పోరు రాబోయే ఆదివారం, అక్టోబర్ 5న జరగనుంది. ఇరు జట్ల మధ్య గత మ్యాచ్‌ల రికార్డును పరిశీలిస్తే, గత 20 సంవత్సరాలలో భారత్, పాకిస్తాన్ మహిళా క్రికెట్ జట్లు 11 సార్లు వన్డే మ్యాచ్‌లలో తలపడ్డాయి. ఈ 11 మ్యాచ్‌లలోనూ భారత్ విజయాలను సాధించింది. అంటే, భారత్, పాకిస్తాన్ జట్లు వన్డే మ్యాచ్‌లలో ముఖాముఖి తలపడటం ఇది 12వ సారి. భారత మహిళా జట్టు ఇప్పటివరకు ప్రదర్శించిన ఆధిపత్యాన్ని బట్టి చూస్తే, ఈ ఆదివారం కూడా పాకిస్తాన్‌పై 12-0 తేడాతో విజయం సాధించడం ఖాయమని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
మెన్స్ ఆసియాకప్ లో పాకిస్థాన్‌కు టీమిండియా కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఆసియా కప్ లో ఇండియా- పాకిస్థాన్ జట్ల మధ్య షేక్ హ్యాండ్ వివాదం ఎంతలా చర్చనీయాంశమైందో అందరికీ తెలిసిందే. దుబాయ్ వేదికగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో పాకిస్థాన్ తో జరిగిన మూడు మ్యాచ్ ల్లోనూ ఇండియా పాకిస్థాన్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నిరాకరించింది. ఈ విషయంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు బీసీసీపై ఐసీసీకి ఫిర్యాదు కూడా చేసింది. ఈ వివాదం ఆసియా కప్ తో ముగిసిందనుంకుంటే ఇప్పుడు మళ్ళీ కొనసాగనుందని సమాచారం. భారత మహిళా జట్టు 2025 వన్డే ప్రపంచ కప్‌లో పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో పాక్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వొద్దని బీసీసీఐ చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రాలేదు.