TEAM INDIA: "తెల్ల"మొహం వేస్తున్న టీమిండియా
చెత్త ప్రదర్శనతో భారత జట్టుపై తీవ్ర విమర్శలు
భారతలో పర్యటనకు విదేశీ జట్లు వచ్చినప్పుడు.. అది ఎంత పెద్ద జట్టు అయినా వైట్ వాష్ చేయడం భారత్‌కు ఆనవాయితీగా వస్తూ వచ్చింది. దాంతో సున్నాలు వాళ్ల వైపు ఉండేవి. కానీ ఇప్పుడు సున్నాలు మనవైపు వస్తున్నాయి. దానికి కారణం మన జట్టుకు చాలా విభాగాల్లో సున్నా మార్కులు పడుతుండటమే. వాటిలో స్వీప్, ఓపిక, నిలకడ, అవగాహన, వరుస సిరీస్‌లు లాంటి ముఖ్యమైన అంశాలున్నాయి. స్పిన్ పిచ్‌లు, అందులోనూ బంతి బాగా టర్న్ అయ్యే పిచ్ లపై ఉన్న మన దేశంలో స్వీప్ షాట్ అనేది హిట్ షాట్. ఒకప్పుడు భారత బ్యాటర్లు ఈ షాట్‌ను అద్భుతంగా ఆడి పరుగులు సంపాదించేవారు. కానీ ఇప్పుడు ఆ పనిని విదేశీ బ్యాటర్లు చేస్తున్నారు. మనవాళ్లు ఫీల్డింగ్‌లో నిలబడి ఆ షాట్లు చూస్తున్నారు. గత న్యూజిలాండ్ సిరీస్, ఇప్పటి సౌతాఫ్రికా సిరీస్‌లో మన బ్యాటర్లు ఎప్పుడో ఓసారి ఆ షాట్ ఆడారు. కొంతమంది ప్రయత్నించినా కనెక్ట్ చేయలేక ఔటయ్యారు. దీంతో మనవాళ్లు స్వీప్‌షాట్లు మరిచిపోయారా అనే డౌట్ వస్తోంది. టెస్టుల్లో ఎంత ఓపికగా బ్యాటింగ్ చేస్తే.. విజయావకాశాలు అంత ఎక్కువగా ఉంటాయని చెబుతారు. ఎన్నో ఏళ్లుగా అదే మన బలంగా ఆడాం. మ్యాచ్‌లు గెలిచాం. టీ20ల వల్లనో, జట్టులో కొత్త రక్తం వల్లనో కానీ మన బ్యాటర్లకు ఓపిక లేకుండా పోయింది. డ్రెస్సింగ్ రూమ్‌లో ఏదో పని ఉంది అన్నట్లుగా వచ్చీ రాగానే భారీ షాట్లకు వెళ్లడం, ఔటవ్వడం ఈ మధ్య కనిపిస్తోంది. దూకుడు ప్రయత్నం ఫలితం ఇవ్వకపోయినా అదే చేస్తూ.. చేజేతులా వికెట్ పోగొట్టుకొని మ్యాచ్‌లు సమర్పించుకుంటున్నారు. క్రీజు నుంచి ఫ్రంట్ ఫుట్ కొచ్చిన బ్యాటర్లూ కనిపించడం లేదు.
అంతా చేసింది గంభీరే
గౌతమ్ గంభీర్, భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్, ఐపీఎల్ 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టును విజేతగా నిలిపిన తరువాత, భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా నియమితుడయ్యాడు. 2024 టీ20 ప్రపంచకప్ టైటిల్ సాధించిన తర్వాత, రాహుల్ ద్రావిడ్ హెడ్ కోచ్ పదవిని గంభీర్‌కు అప్పగించారు. అతని కోచింగ్‌లో భారత్ మెరుగైన ఫలితాలు సాధించగలదని అందరూ భావించారు. కానీ, ఆరు నెలలు గడిచాక, పరిస్థితి అంతగా సానుకూలంగా మారలేదు. గతంతో పోల్చితే, భారత్ ప్రదర్శన మరింత పతనమయ్యింది. గతేడాది ఇదే సమయానికి సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో వరుసగా మూడు టెస్ట్ మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. 93 ఏళ్ల భారత క్రికెట్ చరిత్రలోనే తొలిసారి సొంగడ్డపై క్లీన్ స్వీప్ అయ్యింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కోల్పోయింది. ఈ పరాజయాలతో డబ్ల్యూటీసీ 2025 ఫైనల్ బెర్త్‌ను చేజార్చుకుంది.
బొమ్మ కెప్టెన్
జట్టులో తాను ఆడించినట్లుగా ఆడే కెప్టెన్‌ను పెట్టుకొని ప్రతీ విషయంలో జోక్యం చేసుకుంటూ గంభీర్ జట్టును నాశనం చేస్తున్నాడని ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. ప్రతీ విషయంలో జోక్యం చేసుకుంటే ఫలితాలు ఇలానే ఉంటాయని మండిపడుతున్నారు. వీలైనంత త్వరగా గంభీర్‌ను హెడ్ కోచ్ బాధ్యతల నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. భారత క్రికెట్‌కు గంభీర్ మరో గ్రేగ్ ఛాపెల్‌లా తయారయ్యాడని విమర్శలు గుప్పిస్తున్నారు. గంభీర్ కోచ్ గా ఉండగానే 27 ఏళ్ల తర్వాత శ్రీలంకతో భారత్ వన్డే సిరీస్ కోల్పోయింది. స్వదేశంలో టెస్టు ఇన్నింగ్స్‌లో అత్యల్ప స్కోరుకి ఆలౌట్ అయింది. స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌ను 36 ఏళ్ల తర్వాత కోల్పోయింది.