WWC: ఉత్కంఠభరిత పోరులో టీమిండియా ఓటమి
ప్రపంచకప్‌లో టీమిండియాకు తొలి ఓటమి... దక్షిణాఫ్రికా చేతిలో ఓడిన భారత మహిళలు.. చివరి ఓవర్ వరకూ పోరాడిన భారత జట్టు
మహిళల వన్డే ప్రపంచ కప్ 2025లో భారత్‌కు తొలి ఓటమి ఎదురైంది. గురువారం జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియాపై సౌతాఫ్రికా 3 వికెట్ల తేడాతో గెలిచింది. రిచా ఘోష్ (94) మెరవడంతో తొలుత భారత్ 251 పరుగులకు ఆలౌటైంది. ఈ లక్ష్యాన్ని సఫారీలు 48.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించారు. నాడిన్ డిక్లర్క్ (84*), కెప్టెన్ వొల్వార్ట్ (70), క్లో ట్రైయాన్ (49) రాణించారు. భారత బౌలర్లలో క్రాంతి 2, స్నేహ్ రాణా 2, అమన్‌జ్యోత్, చరణి, దీప్తి ఒక్కో వికెట్ పడగొట్టారు.
నిరాశపర్చిన బ్యాటర్లు
టీమిండియా బ్యాటర్లు మరోసారి విఫలమయ్యారు. స్టార్ బ్యాటర్లు అందరూ విఫలమైన ఎనిమిదో స్థానంలో వచ్చిన రిచా ఘోష్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టును ఆదుకుంది. ఓపెనర్లు ప్రతీకా రావల్ (37), స్మృతి మంధాన (23) శుభారంభం అందించినా తర్వాత వచ్చిన బ్యాటర్లు నిరాశపర్చారు. హర్లీన్ డియోల్ (13), హర్మన్‌ప్రీత్ కౌర్ (9), దీప్తి శర్మ (4), జెమీమా రోడ్రిగ్స్ (0) విఫలమయ్యారు.
రిచా ఘోష్ మెరుపులు
టీమిండియా బ్యాటర్లలో స్నేహ్ రాణా (33) ఫర్వాలేదనిపించింది. ఒక దశలో 83/1తో ఉన్న భారత్.. ఉన్నట్టుండి వికెట్లు కోల్పోయి 102/6తో కష్టాల్లో పడింది. ఈ దశలో అమన్‌జ్యోత్, స్నేహ్ రాణాతో కలిసి రిచా ఘోష్ కీలక భాగస్వామ్యాలు నెలకొల్పింది. 53 బంతుల్లో అర్ధ శతకం అందుకున్న రిచా.. తర్వాత చెలరేగింది. ఆయబొంగా వేసిన 47 ఓవర్లో వరుసగా 4, 4, 6 బాదేసింది. 76, 83 వ్యక్తిగత స్కోరు వద్ద రిచాకు లైఫ్ వచ్చింది. ఆఖరి ఓవర్ ప్రారంభానికి ముందు 84 పరుగులతో ఉన్న రిచా.. మొదటి బంతికి రెండు పరుగులు తీసింది. తర్వాత వరుసగా రెండు ఫోర్లు బాదడంతో సెంచరీ చేసేలా కనిపించింది. కానీ, నాలుగో బంతికి భారీ షాట్ ఆడి లాంగాన్‌లో ట్రైయాన్కు చిక్కడంతో శతకం ఆశలు ఆవిరయ్యాయి. అనంతరం 252 పరుగుల లక్ష్యాన్ని 3 బంతులు మిగిలి ఉండగానే సౌతాఫ్రికా ఛేదించింది. దక్షిణాఫ్రికా బ్యాటర్ నాడిన్ డి క్లెర్క్ అద్భుత పోరాటంతో తన జట్టును గెలిపించింది. డి క్లెర్క్ కేవలం 54 బంతుల్లో అజేయంగా 84 పరుగులు చేసి జట్టును ముందుండి నడిపింది. నాడిన్ డి క్లెర్క్ సిక్స్ కొట్టి దక్షిణాఫ్రికా విజయాన్ని ఖరారు చేసింది. ఎప్పుడూ ఛేజింగ్‌లో వెనుకబడి ఉండే దక్షిణాఫ్రికా విజయం సాధించడం విశేషం. మహిళల ప్రపంచకప్‌లో టీమిండియాకు ఇది తొలి ఓటమి.