Gruha Jyothi: గృహజ్యోతి పథకంపై కీలక అప్‌డేట్..
ఆ గుర్తింపు కార్డు ఉంటేనే ఫ్రీ కరెంట్..;
గృహజ్యోతి లబ్ధిదారులకు ఆధార్ కార్డును తప్పనిసరి చేస్తూ... తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని క్షేత్ర స్థాయిలో విద్యుత్ పంపిణీ సంస్థలు-డిస్కంలు అమలు చేయనున్నట్లు వెల్లడించింది. డిస్కంలకు చెందిన సిబ్బంది క్షేత్ర స్థాయి పరిశీలనకు వచ్చినప్పుడు కచ్చితంగా ఆధార్ ను చూపించాలని లబ్దిదారులకు ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఆధార్ పరిశీలనతో పాటు.. లబ్ధిదారుల బయోమెట్రిక్ ను తీసుకుంటారన్న ప్రభుత్వం., ఒకవేళ బయోమెట్రిక్ సరిగ్గా పనిచేయకుంటే వారి ఐరీస్ ను స్కాన్ చేస్తారని తన ఉత్తర్వుల్లో పేర్కొంది. బయోమెట్రిక్ పరికరాలు పనిచేయకపోతే ఆధార్ నంబరును నమోదు చేయగానే దాని యజమాని సెల్ ఫోన్ కు వచ్చే ఓటీపీ ద్వారా ధ్రువీకరించాలని సూచించింది. ఈ సమాచారం ప్రజలకు తెలిసేలా విస్తృత ప్రచారం చేయాలని డిస్కంలను ఆదేశించింది. లోపాలు తలెత్తినా.. వాటిని పరిష్కరించి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తామని వెల్లడించింది.
లబ్ధిదారుల్లో ఎవరికైనా ఆధార్ లేకపోతే అలాంటి వారు అప్లయ్ చేసుకొని అందుకు సంబంధించిన రుజువు చూపాలి. ఆధార్ జారీ అయ్యేవరకు ఏదైనా ఇతర గుర్తింపు కార్డు విద్యుత్ సిబ్బందికి అందజేయాలి. బ్యాంకు లేదా పోస్టాఫీసు పాస్‌బుక్‌లో ఖాతాదారుడి ఫొటోతో ఉన్న జిరాక్స్, పాన్‌కార్డు, పాస్‌పోర్టు, ఓటరు గుర్తింపు కార్డు, ఉపాధి హామీ పథకం గుర్తింపు కార్డు, కిసాన్ పాస్‌బుక్, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్‌కార్డు, ఎవరైనా గెజిటెడ్ అధికారి లేదా ఎమ్మార్వో ఇచ్చిన ధ్రువీకరణ పత్రం.. వీటిలో ఏదో ఒకటి విద్యుత్ సిబ్బందికి చూపించి పేర్లు నమోదు చేసుకోవచ్చని ఇంధనశాఖ సూచించింది.
అందుకు సంబంధించిన సమాచారం ప్రజలకు తెలిసేలా విస్తృత ప్రచారం చేయాలని డిస్కంలను ఆదేశించింది. ఆధార్ ధ్రువీకరణ పొందాలంటే బయోమెట్రిక్ పరికరాలతో వేలిముద్ర లేదా కనురెప్పలను స్కాన్ చేయాలి. డిస్కంలే ఇందుకోసం పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయాలి. పరికరాలు పనిచేయకపోతే ఆధార్ నంబరును నమోదు చేయగానే దాని యజమాని సెల్‌ఫోన్‌కు వచ్చే ఓటీపీ ద్వారా ధ్రువీకరించాలి. ఇది కూడా సాధ్యం కాకపోతే.. ఆధార్ కార్డుపై ఉండే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి వివరాలు తెలుసుకోవాలి. ఇలా అన్ని రకాల ప్రయత్నాలతో ఆధార్ ధ్రువీకరణ పూర్తిచేయాలని డిస్కంలను రేవంత్ సర్కార్ ఆదేశించింది.