తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం అర్ధరాత్రి నుంచి ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నట్లు తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో బకాయిలు పేరుకుపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ వద్దిరాజు రాకేశ్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఆరోగ్యశ్రీ కింద అనుసంధానమైన 323 ప్రైవేటు ఆసుపత్రులకు ప్రభుత్వం నుంచి సుమారు రూ.1,400 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని అసోసియేషన్ పేర్కొంది. ఈ సమస్య పరిష్కారం కోసం ఆరోగ్యశాఖ మంత్రి, ఆరోగ్యశ్రీ సీఈవోలను కలిసినా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో సేవలు నిలిపివేయక తప్పడం లేదని డాక్టర్ రాకేశ్ వెల్లడించారు.
వైద్య వర్గాల సమాచారం ప్రకారం, ఇటీవల జరిగిన చర్చల్లో రూ.140 కోట్లు విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అందులో భాగంగా సోమవారం రూ.100 కోట్లు విడుదల చేశామని, మిగిలిన రూ.40 కోట్లు త్వరలో విడుదల చేస్తామని తెలిపాయి. కానీ ఈ మొత్తం తమ బకాయిలతో పోలిస్తే చాలా తక్కువని ప్రైవేటు ఆసుపత్రులు చెబుతున్నాయి. ఈ సమ్మె కారణంగా ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న రోగులకు ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స అందే అవకాశం లేదు.