ACCIDENT: చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. 24కి చేరిన మృతులు

కన్నీరు పెట్టిస్తున్న ఘోర ప్రమాదం

Update: 2025-11-03 04:45 GMT

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. మొదట ఇద్దరు మృతి చెందినట్లు అధికారులు తెలుపగా.. తాజాగా వాటి సంఖ్య 24కి చేరింది. మృతుల్లో 10 మంది పురుషులు, 9 మంది మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సుపై కంకర లోడు పడిపోవడంతో పలువురు ప్రయాణికులు అందులో కూరుకుపోయారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మూడు జేసీబీల సాయంతో సహాయక చర్యలు చేపడుతున్నారు. కంకరలో కూరుకుపోయిన వారిని ఒక్కొక్కరిగా బయటకు తీస్తున్నారు. కాగా, ప్రమాదంపై తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. గాయపడిన వారిని హైదరాబాద్‌కు తరలించి మెరుగైన వైద్యం అందించాలని సీఎస్‌, డీజీపీలను ఆదేశించారు. అందుబాటులో ఉన్న మంత్రులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకోవాలని సూచించారు. అత్యవసర వైద్య సాయంతో పాటు అంబులెన్సులు, వైద్య సిబ్బందిని రంగంలోకి దించాలని సీఎం ఆదేశించారు.

ఆర్టీసీ బస్సు ప్రమాదంపై తెలంగాణ మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్, స్పీకర్ గడ్డం ప్రసాద్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలను మంత్రి పొన్నం అధికారులతో ఫోన్ లో మాట్లాడి తెలుసుకున్నారు. జిల్లా అధికారులు, కలెక్టర్ వెంటనే ఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశించారు. సహాయకచర్యలు ముమ్మరం చేయాలని, గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.

Tags:    

Similar News